నేవీ డే సందర్భంగా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిరంజీవి!


తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి హీరోగా రాణిస్తున్న నటుడు చిరంజీవి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన అద్భుత నటనతో మెగాస్టార్ గా ఎదిగారు. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ, కుర్రహీరోల దీటుగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా  గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో చిరంజీవికి అరుదైన అవార్డును ప్రదానం చేశారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుకల అనంతరం తిరిగి వస్తున్న సందర్భంలో గోవా ఎయిర్ పోర్టులో పలువురు నేవీ అధికారులు చిరంజీవితో కలిసి ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోను చిరంజీవి ఇండియన్ నేవీ డే (డిసెంబర్ 4న) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


గోవాలో నేవీ అధికారులతో తీసుకున్న ఫోటోతో పాటు తాను ఎన్‌సీసీలో నేవల్ క్యాడెట్‌గా ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “గత వారం గోవా ఎయిర్ పోర్టులో కొంత మంది నేవీ అధికారులు కలిశారు. వారిని చూడగానే నా పాత రోజులు గుర్తొచ్చాయి. ఎన్‌సీసీలో నేవల్ క్యాడెట్‌గా ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది” అని ట్వీట్ లో రాశారు.





తెలుగు సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు


అటు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న చిరంజీవి పలు కీలక విషయాలను వెల్లడించారు. పదేళ్ల పాటు సినిమాకు దూరంగా ఉన్నా, మళ్లీ తనను ఆదరిస్తూ, అభిమానిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు సినీ ప్రేక్షకులను ఆయన ధన్యవాదాలు చెప్పారు. అరుదైన అవార్డును అందజేసిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎలాంటి ఘనత దక్కినా దానికి కారణం తెలుగు సినిమా పరిశ్రమ, అభిమానులేని చెప్పారు.


చిరంజీవి రాబోయే ప్రాజెక్టులు


 చిరంజీవి ప్రస్తుతం మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ‘వార్తేరు వీరయ్య’లో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ  సినిమా, 2023 సంక్రాంతికి కానుగా థియేటర్లలో విడుదల కానుంది. అటు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ ‘భోలా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు కీర్తి సురేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొన్ని సినిమా కథలు కూడా చిరంజీవి వింటున్నట్లు తెలుస్తోంది.   


Read Also: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!