సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు నార్త్ లో బిజీ అయ్యింది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేపుతోంది. గత కొద్ది నెలల్లోనే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. తాజాగా విడుదలైన ‘థాంక్ గాడ్’, ‘డాక్టర్ జి’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఓటీటీలోనూ విడుదలై మంచి వ్యూస్ అందుకున్నాయి.


ఆకట్టుకుంటున్న ఛత్రివాలి ట్రైలర్


రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ‘ఛత్రివాలి’ సినిమాతో  ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సినిమా జనవరి 20న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లో రకుల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనినించింది. స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించే టీచర్ గా కనిపిస్తోంది. స్కూల్ డేస్ నుంచే శృంగారం గురించి అవగాహన కలిగి ఉండేలా చూడాలని చెప్తోంది. అసురక్షిత సెక్స్ కారణంగా అబార్షన్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడిస్తోంది. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్‌ గురించి బోధించేందుకు ప్రత్యేక సెషన్లు నిర్వహించడం మొదలుపెడుతోంది. గృహిణులు, విద్యార్థులకు రక్షిత సెక్స్ గురించి  అవగాహన కల్పిస్తుంది. ఈ ట్రైలర్ చూడ్డానికి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. కొన్ని శృతిమించిన శృంగార సీన్లు కూడా ఇందులో కనిపించాయి.    






సురక్షిత శృంగారం గురించి సందేశం ఇవ్వడమే ఈ సినిమా లక్ష్యం


ఈ సినిమా గురించి రకుల్ పలు విషయాలు వెల్లడించింది. “‘ఛత్రివాలి’ మా డ్రీమ్ ప్రాజెక్టు. ఈ సినిమా కోసం మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాను. మగ గర్భనిరోధకాలు,  సురక్షితమైన సెక్స్  ప్రాముఖ్యత గురించి సందేశాన్ని ఇంటికి అందించడమే ‘ఛత్రివాలి’ లక్ష్యం. ఈ సినిమాలో నా పాత్ర  అసురక్షిత సెక్స్ కారణంగా అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. దేశ జనాభాలో యువత ఎక్కువ శాతం ఉన్నారు. వారికి సురక్షితమైన సెక్స్ గురించి అవగాహన కల్పించడం అవసరం. ఈ సినిమా అందరిలో ఒక ఆలోచన కల్పించేదిగా ఉండబోతుందని భావిస్తున్నాం” అని రకుల్ ప్రీత్ ఆశాభావం వ్యక్తం చేసింది.  


తేజస్ ప్రభ విజయ్ దియోస్కర్ దర్శకత్వం వహించిన ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా హర్యానాలో జరుగుతుంది. ఈ సినిమాలో రకుల్ సన్యా పాత్రలో నటించింది. సుమీత్ వ్యాస్ కీరోల్ పోషించారు. రకుల్ ఇటీవల నటించిన ‘డాక్టర్ జి’ చిత్రంలో గైనకాలజిస్ట్‌ గా నటించింది.


Read Also: బాలయ్య వారసుడొస్తున్నాడు - కొడుకు కాదు, మనవడు - డైలాగ్ ఇరగదీశాడుగా!