ఫాదర్స్ డే సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. నాన్న గొప్పదనం గురించి వివరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్‌లో ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. "ఓ గొప్ప కొడుకుగానే కాకుండా తండ్రిగానూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నానని ట్వీట్ చేశారు చిరు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ చేశారు. మెగాస్టార్‌తోపాటు ఇంకొందరు సెలెబ్రిటీలు కూడా ఫాదర్స్ డే విషెస్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. "నిన్ను ఏది ఎక్కువగా భయపెడుతుంది అని ఎవరైనా అడిగితే, నాకు భయమే లేదని నా వెనక నాన్న ఉన్నాడని చెబుతాను. నాన్నే నా బిగ్గెస్ట్ స్ట్రెంథ్" అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. "గొప్ప భర్తకు, నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే. నీతో నా జీవితం పంచుకోవటం అదృష్టంగా భావిస్తున్నా" అంటూ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు నమ్రతా షిరోద్కర్.
"నేను మొదటిగా ప్రేమించింది నిన్నే. అన్ని సందర్భాల్లోనూ నా వెంటే ఉన్నందుకు థాంక్స్ నాన్న. లవ్‌యూ పాపా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రిని ఫోటోని షేర్ చేశారు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. సంజయ్ దత్ కూడా ట్విటర్‌లో తన తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేశారు. "ఐ లవ్యూ నాన్న. మా కోసం నువ్వు చేసిన ప్రతి పనికీ థాంక్స్. మా బలం, స్ఫూర్తి ఎప్పటికీ నువ్వే. నీలాంటి తండ్రిని పొందటం నా అదృష్టం. నా రోల్‌మోడల్ నువ్వే" అని ఎమోషనల్ ట్వీట్ చేశారు సంజయ్ దత్.