హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఓ వర్గంలో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గో రక్షక దళాలు కొందరు వ్యక్తులపై చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముందని అభిప్రాయపడ్డారు. దీంతో రైట్ వింగ్ కి చెందిన వారంతా ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సాయి పల్లవి వ్యాఖ్యలపై చాలా నెగటివ్ గా కామెంట్లు వచ్చాయి. అయితే, ఆ విషయంపై ఓ వీడియోలో మాట్లాడుతూ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చారు.


అందరూ మానవత్వం అనేదాని గురించి ఆలోచించాలి అని ఆమె వివరణ ఇవ్వడంతో ఓ వర్గం వారి నుంచి తీవ్రంగా అభ్యంతరాలకు గురిచేసింది. ఈ విషయంలో భజరంగ్ దళ్ మరికొన్ని హిందూ సంఘాలు నాయకులు కూడా సాయి పల్లవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్నటి వరకు ఈ విషయంపై కొంత మౌనంగానే ఉన్న సాయి పల్లవి మొత్తానికి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.


ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని, అందరి ప్రాణాలు ఒకటే అని అన్నారు. మతం పేరుతో హింస చెలరేగేలా చేయడం చాలా పాపమని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని సాయి పల్లవి వ్యాఖ్యానించారు.






అయితే, సాయిపల్లవి ఇచ్చిన క్లారిటీపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. ఆమెను సపోర్ట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘హ్యుమానిటీ ఫస్ట్ (ముందు మానవత్వమే) సాయిపల్లవి.. మేం నీతోనే ఉన్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.






ఆ ఇంటర్వ్యూతోనే మొదలు
నక్సలిజం బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ‘విరాటపర్వం’ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కి మద్దతిస్తారా?’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె కశ్మీరీ పండిట్స్‌, గో హత్యలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.