త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) బంధాలు, అనుబంధాలకు చాలా విలువ ఇస్తారు. సినిమాల్లో ఆ విషయం తెలుస్తుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఆ విధంగా నడుచుకుంటారు. పరిశ్రమలో ఆయన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ఆ మాట చెబుతారు. 'బుట్ట బొమ్మ'తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది.
త్రివిక్రమ్ సతీమణి నిర్మాతగా...త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఓ నిర్మాతగా... ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన సినిమా 'బుట్ట బొమ్మ' (Butta Bomma Movie). ఇందులో అనిఖా సురేంద్రన్ ప్రధాన తార. తమిళ అనువాదాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ దాస్ ఓ రోల్ చేశారు. మరో రోల్ సూర్య వశిష్ఠ (Surya Vashistta) చేశారు.
సూర్య వశిష్ఠ ఎవరో తెలుసా?
'బుట్ట బొమ్మ' చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్న సూర్య వశిష్ఠ ఎవరో తెలుసా? ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కుమారుడు. చిత్ర పరిశ్రమలో సుమారు 30 ఏళ్ళు ఆయన పని చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, గురూజీ త్రివిక్రమ్ దగ్గర పని చేశారు. కరోనా కాలంలో ఆయన కాలం చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు సూర్య వశిష్ఠను త్రివిక్రమ్ హీరో చేశారు.
త్రివిక్రమ్ గారికి రుణపడి ఉంటా!
'బుట్ట బొమ్మ' విడుదల సందర్భంగా సూర్య వశిష్ఠ మాట్లాడుతూ ''నన్ను నటుడిగా చూడాలనేది మా నాన్నగారు సత్యం కోరిక. నాకూ సినిమాలు అంటే చాలా ఇష్టం. అమెరికాలో చదువు పూర్తి అయ్యాక కొంత కాలం ఉద్యోగం చేశా. తర్వాత ఇండియా వచ్చేశా. సినిమా ప్రయత్నాలు ప్రారంభించాను. నాన్నగారు మలయాళంలో మంచి విజయం సాధించిన 'కప్పేల' చూపించారు. ఆటో డ్రైవర్ రోల్ నాకు సరిపోతుందని చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమా రీమేక్ రైట్స్ సితార సంస్థ తీసుకోవడంతో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే... కరోనా కారణంగా నాన్నగారు మరణించారు. ఓ ఏడాది అసలు బయటకు రాలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారిని కలిశా. ఆయన సూచన మేరకు సితార ఆఫీసుకు వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అప్పుడు 'బుట్ట బొమ్మ'కు ఎంపిక చేశారు'' అని చెప్పారు. ''మా నాన్నగారి చివరి కోరిక నెరవేరేలా చేసిన త్రివిక్రమ్ గారికి, సితార సంస్థకి జీవితాంతం రుణపడి ఉంటా'' అని సూర్య వశిష్ఠ పేర్కొన్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
అనిఖాకు డైలాగుల్లో సాయం చేశా
''అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్... ఇద్దరితో కలిసి పని చేయడం ఎంతో సరదగా ఉంది. అనిఖా మంచి మనసున్న అమ్మాయి. ఆమెకు తెలుగు రాకపోవడంతో... సెట్స్‌లో కొన్ని సంభాషణల్లో సాయం చేసేవాడిని. అర్జున్ దాస్ స్టార్. ఆయన వాయిస్, ఆ గొంతుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. షూటింగులో నాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు'' అని సూర్య వశిష్ఠ చెప్పారు. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానుంది.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?