మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.


 ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్లు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పుడు అదే తేదీల్లో కొన్ని భారీ సినిమాలు రావడానికి సిద్ధమవుతున్నాయి. 


చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో విక్రమ్ నటిస్తోన్న 'కోబ్రా' సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. విక్రమ్ కి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. స్ట్రెయిట్ సినిమాల మాదిరి అతడి సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ తప్పేలా లేదు. ఈ సినిమాలతో పాటు సమంత నటిస్తోన్న 'యశోద' సినిమా, అఖిల్ 'ఏజెంట్' సినిమాలు అదే వారంలో విడుదల కానున్నాయి. 


అలానే బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'లాల్ సింగ్ చద్దా' కూడా ఆగస్టు 11నే రిలీజ్ కానుంది. ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా ఆగస్టులో రావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయో..? లేక కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయో..? చూడాలి! 


Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్


Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!