T Series Bhushan Kumar: ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ-సిరీస్ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ కు న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. ఆయనపై ఉన్న అత్యాచారం ఆరోపణలను ముంబై కోర్టు ఎత్తివేసింది. పోలీసులు బి సమ్మరి రిపోర్టు అందజేసిన అనంతరం, భూష‌ణ్‌ కుమార్‌ మీద ఉన్న అభియోగాలను ఉపసంహరించుకోవాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. బి సమ్మరి రిపోర్టు అంటే, ఉద్దేశ పూర్వకంగా నిందితుడి మీద ఎదుటి వ్యక్తి తప్పుడు ఫిర్యాదు, ఆరోపణలు చేసినట్లు పోలీసులు న్యాయస్థానికి ఇచ్చే నివేదిక. నవంబర్ 9న పోలీసులు ఇచ్చిన ఈ నివేదికను అంధేరీ మేజిస్ట్రేట్ తాజాగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో భూషణ్ కుమార్ మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు అధికారికంగా ముగింపు పలికినట్లు అయ్యింది.

  


గతంలో బి-సమ్మరి నివేదికను కొట్టివేసిన బాంబే హైకోర్టు


నిందితుల మీద తగిన సాక్ష్యాలు లేనప్పుడు లేదంటే స్పష్టమైన కేసు లేనప్పుడు సాధారణంగా పోలీసులు 'బి సమ్మరి' నివేదిక దాఖలు చేస్తారు. తప్పుడు ఆరోపణల కేసుల్లో కూడా దీనిని పోలీసులు దాఖలు చేస్తున్నారు. ఈ రిపోర్టు ద్వారా చాలా మంది నిందితులు చేయని తప్పు నుంచి నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. అయితే, భూషణ్ కుమార్ కేసు దర్యాప్తు సమయంలో పలు రాజీ అంశాలు చర్చ‌కు వ‌చ్చాయి. అదే సమయంలో, ఏప్రిల్ 2022లో భూష‌ణ్ కుమార్‌పై పోలీసులు దాఖలు చేసిన బి-సమ్మరి నివేదికను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.


2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు


జూన్ 2018లో భూషణ్ కుమార్‌పై మెరీనా కువార్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.  జూలై 2021లో భూషణ్ కుమార్‌ మీద  DN నగర్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం, మోసానికి సంబంధించి కేసు నమోదు అయ్యింది.  తన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భూష‌ణ్ కుమార్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని స‌ద‌రు మహిళ ఫిర్యాదులో వెల్లడించింది. కొద్ది రోజుల తర్వాత  ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. కొన్ని కారణాలతో అతడిని అపార్థం చేసుకుని కేసు పెట్టినట్లు వెల్లడించింది. తాజాగా న్యాయ స్థానం భూషణ్ కుమార్ మీద ఉన్న అత్యాచారం అభియోగాలను అధికారికంగా ఎత్తివేసింది.   


ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన భూషణ్ కుమార్‌


భూషణ్ కుమార్ దువా ప్రస్తుతం టీ సిరీస్ అధినేతగా కొనసాగుతున్నారు. అంతేకాదు, పలు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగానూ కొనసాగుతున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో 10,000 కోట్ల నికర ఆస్తులతో భూషణ్ కుమార్ 175వ స్థానంలో నిలిచారు. భూషణ్ తండ్రి గుల్షన్ కుమార్ హత్య తర్వాత 1998లో టీ-సిరీస్ సంస్థకు అధినేగా మారారు. ముందు సినిమా పాటలకు సంబంధించిన ఆడియో, వీడియో సీడీలతో పాటు క్యాసెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కంపెనీ, నెమ్మదిగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘యానిమల్’ సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. భూషణ్ కుమార్ మీద పలు కేసులు నమోదు అయ్యాయి. పన్ను ఎగవేతతో పాటు బినామీ మార్గాల ద్వారా ఆస్తులను కొనుగోలు చేసేందుకు వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపించింది.    


Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ రోరింగ్, రణబీర్ కెరీర్‏లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్ల వసూళ్లంటే?



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply