సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు టీవీ హోస్ట్ లుగా ఇప్పుడిప్పుడే కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అయితే ఉత్తరాదిన మాత్రం ఈ కల్చర్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై పాపులర్ అయిన ఎంతోమంది సార్లు బుల్లితెరపైకి వచ్చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి చాలా మంది స్టార్ హీరోలు స్మాల్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ తో సమానంగా బుల్లితెరపై కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.
తాజాగా ఈ లిస్ట్ లోకి రణవీర్ సింగ్ కూడా చేరాడు. 'ది బిగ్ పిక్చర్' అనే షో చేయబోతున్నాడు. ఇతడు ఒక్కో షోకు ఎంత తీసుకుంటున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అయితే మిగిలిన స్టార్స్ మాత్రం బుల్లితెరపై ఎంత ఛార్జ్ చేస్తున్నారో చాలా మందికి తెలుసు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తి బిగ్ బీ.
'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. ఒక్క సీజన్ మినహా అన్ని సీజన్లకు అమితాబ్ స్వయంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బీ అంటే కేబీసీ.. కేబీసీ అంటే బిగ్ బీ అనే ఇమేజ్ వచ్చేసింది ఇప్పడు. ఈ కార్యక్రమం కోసం బిగ్ బీ.. మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటారట. ఈ షోలోకి వచ్చిన తరువాత అమితాబ్ వందల కోట్ల అప్పులన్నీ తీర్చేశారని చెబుతుంటారు. అంటే ఆయన ఎంతగా సంపాదించారో అర్ధం చేసుకోవచ్చు.
అమితాబ్ తరువాత టీవీల్లో అత్యధిక సంపాదన ఆర్జిస్తోంది సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోకి బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్.. ఆ కార్యక్రమం ప్రారంభం నుండి ప్రతి సీజన్ కు తనే పారితోషికం పెంచుతూ వస్తోన్న సల్మాన్.. 14వ సీజన్ లో ప్రతి ఎపిసోడ్ కు రూ.16 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.
హిందీలో కేకేకే(ఖత్రోన్ కి ఖిలాడీ) సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న దర్శకుడు రోహిత్ శెట్టి.. ఒక్కో ఎపిసోడ్ కి రూ.49 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఇక సూపర్ డాన్సర్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి.. తాజా సీజన్ కోసం 18 నుండి 20 లక్షల రూపాయలు తీసుకుంటోందట. అదే విధంగా మరో డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఒక్కో ఎపిసోడ్ రూ.90 లక్షల నుండి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటోంది.
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా బుల్లితెరపైకి వచ్చాడు. గతంలో 'సత్యమేవ జయతే' అనే షో చేశాడు. ఈ కార్యక్రమం కోసం ఒక్కో ఎపిసోడ్ కి మూడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇలా బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది నటీనటులు.. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై రెండు చేతులా సంపాదిస్తున్నారు.