బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలతోనే కాదు.. వివాదాలతోనూ సావాసం చేస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డేట్ చెప్పి మరీ చంపేస్తామని గ్యాంగ్ స్టర్స్  బెదిరిస్తున్నారంటే సల్మాన్ ఎలాంటి వివాదాల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గతంలో పలు కేసుల్లో ఇరుక్కుని జైలులో కూడా ఉన్నాడు సల్లూ భాయ్. సల్మాన్ ను చంపేస్తామని ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు వార్నింగ్ ఇవ్వడం, దీంతో కండల వీరుడు హై ఎండ్ బుల్లెట్ ఫ్రూఫ్ కారుని ఫారిన్ నుంచి తెప్పించుకోవడంతో.. సల్మాన్ కేసులు మరోసారి తెర మీదకు వచ్చాయి. 1998 కృష్ణ జింకల కేసు మొదలుకొని ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ మీద చట్టప్రకారం నమోదైన కేసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


1. బ్లాక్‌ బక్ (క్రిష్ణ జింకల) కేసు:


1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్‌ సమయంలో కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు సల్మాన్ ఖాన్ అండ్ టీమ్ పై ఆరోపణలు వచ్చాయి. బిష్ణోయ్ సంఘం సభ్యులు ఫిర్యాదు చేయడంతో, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు సల్మాన్‌ ను దోషిగా నిర్ధారించింది. సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌ తో సహా ఇతర నిందితులైన సినీ స్టార్స్ ను నిర్దోషులుగా పేర్కొంది. అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 16 వారూ పోలీసు కస్టడీలో ఉన్న సల్మాన్ కు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 25 వేల రూపాయల జరిమానాతో పాటుగా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. చివరకు 2018 ఏప్రిల్ 5న సల్మాన్ ను దోషిగా నిర్ధారించగా.. ఏప్రిల్ 7న కృష్ణజింకల కేసులో బెయిల్ మంజూరైంది.


2. బ్లాక్‌ బక్ కేసు (మథానియా):


మథానియా గ్రామంలో ఒక కృష్ణజింకను వేటాడినట్లు సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సల్మాన్ 2007 ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 13 వరకు.. ఆగస్టు 26 నుండి ఆగస్టు 30 మధ్య కొంతకాలం జైలులో గడిపాడు. అయితే 2016 జులై 25న రాజస్థాన్ హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. దీని సవాలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. కృష్ణజింక వేట నేపథ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్‌కు హత్య బెదిరింపులు చేస్తున్నాడు. తాము దైవంగా భావించే కృష్ణజింకను చంపి, తమ వర్గం మనోభావాలను సల్మాన్ కించపరిచాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నాడు.


3. చింకారా కేసు:


2018 సెప్టెంబర్ 26 మరియు 27 తేదీల్లో రెండు చింకరాలను వేటాడనే ఆరోపణలతో భవద్‌ లో సల్మాన్ ఖాన్ పై మరో కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. చివరకు జూలై 25, 2016న అతన్ని నిర్దోషిగా విడుదల చేసారు. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. అది పెండింగ్‌లో ఉంది.


4. ఆయుధాల చట్టం (ఆర్మ్స్ యాక్ట్):


కృష్ణజింకలను వేటాడేందుకు లైసెన్స్‌ గడువు ముగిసిన 0.22 రైఫిల్ & 0.32 రివాల్వర్‌లను సల్మాన్ ఖాన్ ఉపయోగించాడని ఆరోపణలు ఉన్నాయి. 1998 అక్టోబర్‌లో దీనిపై కేసు నమోదు చేయగా, 2017 జనవరి 18న ఈ కేసులో సల్లూ భాయ్ నిర్దోషిగా విడుదలయ్యారు.


5. హిట్ అండ్ రన్ కేసు:


2002 సెప్టెంబర్ లో సల్మాన్ ఖాన్ కు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారు బాంద్రాలోని అమెరికన్ బేకరీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న ఓ కూలీ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సల్మాన్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా, పరిమితికి మించి డ్రింక్ చేసినట్లు తేలింది. IPC మోటారు వాహనాల చట్టం - 1988, బాంబే నిషేధ చట్టం-1949 కింద సల్మాన్ పై అభియోగాలు మోపారు. సల్మాన్ డ్రైవింగ్ సీటులో ఉన్నారని సాక్షులు పేర్కొనగా.. ఆ వాదనలను ఖండించారు. అతని లెఫ్ట్ డోర్ జామ్ అయినందువల్ల డ్రైవర్ సీటు నుండి బయటపడవలసి వచ్చిందని సల్మాన్ కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన సల్మాన్ బాడీ గార్డ్ రవీంద్ర పటేల్ టిబితో మరణించాడు. ఈ కేసులో సల్మాన్ అరెస్ట్ కాబడి, వెంటనే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. మహారాష్ట్ర ప్రభుత్వం అతన్ని నిర్దోషిగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.


Also Read దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్