బిగ్‌బాస్ ఫన్నీ టాస్కులతో సరదాగా సాగుతోంది. మధ్యలో సిరి-షన్ను రొటీన్ వ్యవహారాలు, కాజల్-శ్రీరామ్ మధ్య గొడవలతో కాస్త ఆసక్తికరంగానే మారింది. రోల్ ప్లే టాస్కుతో ఇంటి సభ్యులు ప్రేక్షకులను తెగనవ్వించారు. అంతవరకు వారి పడిన గొడవలు కూడా మర్చిపోయేలా చేశారు. గురువారం ఎపిసోడ్ కూడా ఫన్నీఫన్నీగా సాగేలా  కనిపిస్తోంది. ముఖ్యంగా డ్యాన్సులతో దద్దరిల్లేలా ఉంది. నేటి ఎపిసోడ్ తాజా ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. 


ప్రేక్షకులను ఓట్లు వేయమని అప్పీల్ చేసే అవకాశం టాస్కులో ఉత్తమ ప్రదర్శన చేసేవారికి దక్కుతుంది. అందులో భాగంగా నేటి టాస్కులో ఇంటి సభ్యులు తమ ఫేవరేట్ సినిమా క్యారెక్టర్లను పోషించాల్సి ఉంటుంది. ఆ పాత్రల్లోనే జీవించాలి,నవ్వించాలి, డ్యాన్సులు చేయాలి. కాగా కాజల్ అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను, సన్నీ బాలయ్యలా, శ్రీరామ్ ముఠా మేస్త్రీ,  సిరి జెనిలియాలా, మానస్ గబ్బర్ సింగ్, షణ్ముక్ పోలీస్ పాత్రలో కనిపించారు.


బిగ్ బాస్ ఏర్పాటు చేసిన వేదికపై ప్లే అవుతున్న పాటకు తగ్గట్టు డ్యాన్సులతో అదరగొట్టారు. అందరికన్నా కాజల్ ఫుల్ జోష్ తో డ్యాన్సు చేసింది. చివరలో మానస్ గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్సును ఇరగదీశాడు. మధ్యలో సన్నీ ఫన్నీ డైలాగులు కూడా కడుపుబ్బా నవ్వించాయి. కాజల్ ను ఉద్దేశించి ‘శ్రీదేవి గారిని చూసిన కళ్లతో నిన్ను చూడలేక...’ అంటూ కొట్టిన డైలాగుకు అందరూ పడిపడి నవ్వారు. కాజల్ ను శ్రీరామ్ ‘తింగరబుచ్చి’ అని పిలిచాడు. దానికి కాజల్ ‘తింగరబుచ్చి అనగానేమి’ అంటూ నవ్వులు పూయించింది.