Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు చేరుకుంది. టాప్ 6 కంటెస్టెంట్స్ అయిన పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, యావర్.. ఫినాలేలోకి అడుగుపెట్టారు. వీరిలో విన్నర్ ఎవరు అధికారికంగా తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. అందులో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ సీజన్స్‌కు గెస్ట్‌లుగా వచ్చాడు రవితేజ. తాజాగా మరోసారి వచ్చి టాప్ 6 కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. ఇంతలోనే రవితేజకు వీరాభిమాని అయిన అమర్‌దీప్‌కు నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ కోసం బిగ్ బాస్ టైటిల్‌ను కూడా అమర్ వదులుకోవడానికి సిద్ధమయ్యాడా అని ప్రోమో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


రవితేజతో సినిమా ఆఫర్..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన అమర్‌దీప్‌కు మాస్ మహారాజ్ రవితేజ అంటే అభిమానమని ఇప్పటికీ చాలా సందర్భాల్లో బయటపెట్టాడు. అంతే కాకుండా తను రవితేజ వీరాభిమానిని అని చెప్తూ.. ఒకటే హెయిర్ స్టైల్‌ను కూడా మెయింటేయిన్ చేస్తుంటాడు అమర్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు రవితేజ ఒక గెస్ట్‌గా వచ్చాడు. తనను చూసి అమర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అది చూసిన నాగార్జున.. ‘‘నీకొక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను. గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చేస్తే రవితేజ తరువాతి సినిమాలో తనతో పాటు యాక్ట్ చేస్తావు. నేను నీకు 7 సెకండ్లు టైమ్ ఇస్తున్నాను’’ అని అమర్‌కు ఆఫర్ ఇచ్చారు.


ఏం అనాలో తెలియడం లేదు..
నాగార్జున ఇచ్చిన ఆఫర్ విన్న అమర్.. ఒక క్షణం ఆలోచించి వెంటనే తెరిచిన గేట్లవైపు పరిగెత్తాడు. అది చూసి అమర్ తల్లి, భార్యతో పాటు రవితేజ, నాగార్జున కూడా షాక్ అయ్యారు. ‘‘ఏం అనాలో తెలియడం లేదు’’ అంటూ భావోద్వాగానికి లోనయ్యాడు మాస్ మహారాజ్. ‘‘105 రోజులు తను అక్కడ కష్టపడ్డాడు’’ అని అమర్ గురించి చెప్పుకొచ్చారు నాగార్జున. ఇదంతా చూసిన అమర్ భార్య తేజస్విని కూడా ఎమోషనల్ అయ్యింది. మరి ప్రోమోలో చూపించినట్టుగా అమర్ నిజంగానే రవితేజతో నటించే అవకాశం కోసం బిగ్ బాస్ టైటిల్‌ను వదిలేసుకుంటాడా లేదా ఇందులో కూడా ఏమైనా ఉల్టా పుల్టా ఉందా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.






సూట్‌కేస్ కూడా వద్దన్నాడు..
ఇప్పటికే రూ.10 లక్షలు ఉన్న సూట్‌కేస్‌ను హౌజ్‌లోకి పంపించి.. ఎవరైనా కంటెస్టెంట్ కావాలనుకుంటే ఆ సూట్‌కేసును తీసుకొని అప్పటికప్పుడు హౌజ్ నుండి వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అయినా కూడా ఏ కంటెస్టెంట్ కూడా టైటిల్‌ను వదులుకొని ఆ సూట్‌కేస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే విషయంపై శివాజీ.. అమర్‌ను అడగగా.. ఎంత డబ్బు ఇచ్చినా టైటిల్‌ను మాత్రం త్యాగం చేయను అని, రాసిస్తాను అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అలాంటిది తన అభిమాన హీరోతో నటించే ఛాన్స్ వస్తుంది అనగానే టైటిల్‌ను కూడా త్యాగం చేయడానికి అమర్ సిద్ధమయ్యాడు అంటే గ్రేట్ అని తన అభిమానులంతా.. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read: టేస్టీ తేజాకు లక్కీగా మారిన 'బిగ్ బాస్' హౌస్ - అన్ని సినిమాల్లో ఆఫర్స్ ఏంటి బాసూ?