Vijay Sethupathi Remuneration: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆయన ఈ షో కోసం ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారో తెలుసా?
విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) బిగ్ బాస్ తమిళ్ లో ఇప్పటి వరకు నడిచిన సీజన్లు అన్నింటిలోనూ హోస్ట్ గా చేశారు. మొదటి సీజన్ నుంచి మొదలు పెడితే రీసెంట్ గా పూర్తయిన ఏడవ సీజన్ దాకా ఆయనే ముందుండి షోను నడిపించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ కమల్ హాసన్ ఫేవరిజం చూపిస్తున్నారు అంటూ విమర్శలు వెల్లువెతాయి. అయితే ఎన్ని వివాదాలు విన్పించినా షోకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో బిగ్ బాస్ కే మంచి టిఆర్పి రేటింగ్, క్రేజ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ నేపథ్యంలోనే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన కమల్ హాసన్ తాజాగా 8వ సీజన్ కు హోస్ట్ గా తప్పుకున్నారు. ఆయన స్థానాన్ని మరో తమిళ స్టార్ విజయ్ సేతుపతి భర్తీ చేశారు.
బిగ్ బాస్ తమిళ సీజన్ 8 అక్టోబర్ 6న అట్టహాసంగా మొదలైంది. ఈ షో లాంచ్ ఈవెంట్ లో విజయ్ సేతుపతి వైట్ సూటు బూటు ధరించి అద్భుతంగా కనిపించారు. అయితే ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి ఈ షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి అంతకుముందు హోస్ట్ గా కమల్ హాసన్ తీసుకున్న పారితోషకంలో సగం మాత్రమే అందుకుంటున్నారని తెలుస్తోంది. మునుపటి సీజన్లకు హోస్ట్ గా చేసిన కమల్ హాసన్ రెమ్యూనరేషన్ గా దాదాపు 130 కోట్లు అందుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 8కి హోస్ట్ గా చేస్తున్న విజయ్ సేతుపతి కేవలం 60 కోట్లు మాత్రమే అందుకుంటున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలపై అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు. నిజానికి హోస్ట్ తో పాటు షోలో పాల్గొనే కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ విషయాన్నీ కూడా ఎప్పుడు బయటపెట్టరు.
విజయ్ సేతుపతికి ఇదే మొదటిసారి కాదు...
కాగా విజయ్ సేతుపతి బుల్లితెరపై ఒక షోను నడిపించడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన 'తమిళ మాస్టర్ చెఫ్' అనే షోలో భాగమయ్యారు. ఇప్పుడు 'తమిళ బిగ్ బాస్ సీజన్ 8'కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా 'మహారాజా' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న విజయ్ సేతుపతి 'బిగ్ బాస్ 8' లాంచ్ కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా కనిపించారు. అయితే బిగ్ బాస్ అంటేనే గొడవలు, వివాదాలు.. కంటెస్టెంట్లను కొన్నిసార్లు మందలించాల్సి ఉంటుంది కూడా. అక్కడ ఏమాత్రం తడబడినా హోస్ట్ గా ఫెయిల్ అయ్యారు అనే విమర్శలు తప్పవు. మరి విజయ్ సేతుపతి ఈ షోను ఎలా నడిపిస్తారో చూడాలి.