బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా పాపులర్ అయింది బిగ్ బాస్ షో. సౌత్ లో కూడా ఈ షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అయితే అదే రేంజ్ లో తిట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు.. వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది ఈ షో. ప్రతి సీజన్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు గొడవలు కూడా ఓ రేంజ్ లో అవుతున్నాయి. అయితే గంటసేపు ఉండే ఈ షోలో నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో బిగ్ బాస్ టీమ్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ను ప్రవేశపెట్టింది. 24 గంటల పాటు ఓటీటీలో బిగ్ బాస్ షోని చూడొచ్చు. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ నిజం కాదని అంటోంది నటి వనితా విజయ్ కుమార్. ఈ మేరకు బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేసింది. తమిళ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది వనితా. అయితే రీసెంట్ గా ఈ షో నుంచి బయటకు వచ్చేసింది.
అలా బయటకు వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని.. బిగ్ బాస్ హౌస్ చిరాకు తెప్పించే ఓ ప్రదేశమని చెప్పింది. అక్కడ ఉన్నందుకు ఇప్పటికీ తనను పీడకలలు వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చింది. ఆ షో నుంచి బయటకు వచ్చేసినప్పటికీ.. పూర్తిగా దాని నుంచి బయటపడడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.
హౌస్ లో ఉన్నప్పుడు తను మాట్లాడింది కానీ, అభిరామి మాటలకూ కానీ టెలికాస్ట్ చేయలేదని.. ఇది అసలు లైవ్ షో కాదని.. వాళ్లకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి వివాదాస్పదంగా ఉండేలా టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. పేరుకే ఎంటర్టైన్మెంట్ షో కానీ అందులో మెయిన్ ఎంటర్టైన్మెంటే మిస్ అవుతుందని.. షో కాంప్లికేటెడ్ గా మారిపోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బిగ్ బాస్ ఒక చీప్ షో.. వాళ్ల చీప్ టాక్టిక్స్ తో కంటెస్టెంట్స్ క్యారెక్టర్ ను తప్పుగా చూపిస్తున్నారంటూ మండిపడింది.