Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 3వ కంటెస్టెంట్‌గా నిలిచాడు శివాజీ. అయితే ఓటింగ్ విషయంలో శివాజీకి అన్యాయం జరిగిందని, విన్నర్ కాకపోయినా కనీసం రన్నర్ స్థానంలో అయినా ఆయన ఉండేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. సీజన్ మొదటి నుంచి ఓటింగ్ విషయంలో టాప్ స్థానంలో ఉన్న శివాజీకి 3వ స్థానం ఎలా దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి శివాజీ.. ముందుకు రాక తప్పలేదు. తన బిగ్ బాస్ ప్రయాణం గురించి, నాగార్జున గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఒక వీడియోను విడుదల చేశాడు శివాజీ.


నా బిడ్డ గెలిచాడు..
‘‘చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టార్ మా వాళ్లు శివాజీని వెనకాల పెట్టారు. వేరేవాళ్లను ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్లు పద్ధతి ప్రకారం, ఒక ఫార్మాట్‌లో వెళ్తారు. దాని ప్రకారమే ఓటింగ్ జరిగింది. దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలని అనుకున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడూ ఓడిపోతుంటాడు. ఈ సీజన్‌లో కామన్ మ్యాన్ గెలవాలి, వాడిని గెలిపించాలి అని ధృడ సంకల్పంతో ఉన్నాను. ప్రశాంత్ వచ్చేవరకు నాకు అలాంటి ఆలోచన లేదు. నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చానో.. తను కూడా షోకు అలాగే వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి సక్సెస్ అయితే కోట్లమందికి ఇన్‌స్పిరేషన్‌లాగా ఉంటుందని అనుకున్నాను. నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు ఆ భగవంతుడు’’ అంటూ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు శివాజీ.


మా హృదయాలు కలిశాయి..
‘స్పై’ బ్యాచ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై కూడా శివాజీ స్పందించాడు. ‘‘ప్రశాంత్ మాత్రమే కాదు.. యావర్‌లాంటి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని మనుషులు నాతో పాటు కంటెస్టెంట్స్‌గా రావడం.. మా హృదయాలు కలవడం.. ఇదంతా కూడా దేవుడి నిర్ణయం. అంతే కానీ ఒక గ్రూప్‌లాగా ఆడాలని ఆలోచన గానీ, మన ఆటలో ఇంకొకరి జోక్యం ఉండాలి అనేది పరమ బూతు. బిగ్ బాస్ షో మూలసూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంత:కరణశుద్ధితో నేను పనిచేశాను. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలు చూడాలనుకున్నాను. చూశారు. కోట్లమంది అభిమానులుగా వాళ్ల గుండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ ‘స్పై’ బ్యాచ్ వల్ల తన గేమ్ డైవర్ట్ అవ్వలేదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు.


అలా ఏం కాదు..
‘‘బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ నా లైఫ్‌లో ఒక మధురానుభూతి. ఈ పాఠశాలలోకి జీవితంలో ఒక్కసారి మాత్రమే అవకాశం దొరుకుతుంది ఎవ్వరికైనా. ఈ అవకాశం నాకు ఇచ్చినవారికి సదా రుణపడి ఉంటాను. బిగ్ బాస్ అనగానే ప్రతీ ఒక్కరూ.. అక్కడి వెళ్లి గొడవలు చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయాలి, అవసరమైతే.. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లాలి అని దురభిప్రాయంలో ఉన్న వారందరికీ కూడా చెప్తున్నాను.. అలా ఏం కాదు, ఇది నిజంగానే ఒక పాఠశాల, దీంట్లో క్రమశిక్షణ చాలా అవసరం. ఇది మనకు జీవిత పాఠాలు నేర్పిస్తుందని ఈ షో ద్వారా అందరికీ చెప్పాలనుకున్నాను. చెప్పాను’’ అంటూ బిగ్ బాస్ షోను ప్రశంసించారు. అంతే కాకుండా నాగార్జుపై కూడా ప్రశంసలు కురిపించాడు శివాజీ. అందరూ చేసే తప్పులను అందంగా, అందరికీ నచ్చే విధంగా నాగార్జున చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. ఆయన హోస్ట్‌గా ఉండడం కంటెస్టెంట్స్‌కు అదృష్టం అన్నాడు. తాను ఎక్కడా భయపడే మనిషి కాదని, కానీ నాగార్జున దగ్గరకు వచ్చేసరికి ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడేవాడినని తెలిపాడు. నాగార్జునకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బయటపెట్టాడు శివాజీ. 


Also Read: అదంతా స్ట్రాటజీ, నాగార్జునపై కేసు నమోదు చేయాలి - సీపీఐ నారాయణ ఆగ్రహం