బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత శివాజీ పేరు మళ్లీ ప్రేక్షకుల నోట వినిపిస్తోంది. దాదాపుగా పది సంవత్సరాల క్రితం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో హీరోగా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా కనిపించేవారు శివాజీ. కానీ మెల్లగా వెండితెరపై ఆయన కనిపించడం తగ్గిపోయింది. తనంతట తానుగా వెళ్లి అవకాశాలు ఎవరినీ అడగడం తనకు నచ్చదని, అందుకే అలాగే ఉండిపోయానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శివాజీ. తాజాగా తనకు అవకాశాలు రాని సమయంలో తాను ఏం చేశాడో చెప్పడంతో పాటు ఇండస్ట్రీలో పెద్ద హీరోల మనస్థత్వాల గురించి, వారితో తనకు ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాడు.


నువ్వు నేను సినిమా చేస్తాననుకున్నా..


‘‘నేను అభిమానించే డైరెక్టర్లను నేను అడుగుతూనే ఉన్నాను. ఏ అవకాశం ఉన్నా నేను చేస్తాను. చేయను అని అనుకోవద్దు. 100 శాతం నేను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు శివాజీ. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సినిమాలు తన దగ్గరకు వచ్చాయని, ఇప్పుడు తనంతట తానుగా సినిమాల దగ్గరకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని బయటపెట్టారు. ‘‘ముఖ్యంగా తేజ గారిని అవకాశాలు కోసం అడుగుతుంటా. ఆయన ఎప్పుడో మాటిచ్చారు నాకు. మొదటి సినిమా చిత్రం సమయంలోనే మాటిచ్చారు. అందుకే ఆ సినిమాలో ఉదయ్ కిరణ్‌కు డబ్బింగ్ చెప్పాను. నువ్వు నేనులోనే అవకాశం వస్తుంది అనుకున్నాను. ఆఫీసుకు కూడా వెళ్లాను’’ అని తేజ తనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు శివాజీ.


చిరంజీవి రూ.10 వేల సాయం


రామారావుగారు కోట్లు సంపాదించాడు కానీ తీసుకుపోయాడా అని ప్రశ్నిస్తూ.. మనం ఉన్నదానితోనే తృప్తిపడాలి అని చెప్పుకొచ్చాడు శివాజీ. అంతే కాకుండా చిరంజీవికి తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుచేసుకున్నాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో తాము అందరం బస్‌లో వస్తున్నప్పుడు ఎవరో చిరంజీవికి శివాజీ రెంట్ కట్టడానికి కష్టపడుతున్నాడు అని చెప్పారట. దీంతో వెంటనే ఆయన పక్కకి పిలిచి, ఎవరికీ తెలియకుండా రూ.10 వేలు చేతిలో పెట్టారట. ఆయన ఇచ్చిన డబ్బుతోనే సంవత్సరం పాటు రెంట్ కట్టడానికి ఇబ్బంది లేకుండా జీవించానని శివాజీ గుర్తుచేసుకున్నాడు. అంతే కాకుండా ఈరోజుల్లో అలాంటి పరిస్థితి ఎవరికి ఉందని తెలిసినా.. సాయం చేయడానికి తాను ముందుకొస్తానని అన్నాడు. 


చిరంజీవి, ఎన్‌టీఆర్ అలా చేశారు


చిరంజీవితో శివాజీ క్లోజ్ అవుతున్నాడని భావించిన కొందరు.. తనకు, శివాజీకి మధ్య మనస్పర్థలు వచ్చేలా చేశారని చెప్తూ శివాజీ ఫీల్ అయ్యారు. చిరంజీవి.. నాగార్జున, వెంకటేశ్‌లాగా కాదు అని.. ఒకవేళ ఆయనకు నచ్చితే చాలా దగ్గర మనిషిలాగా భావిస్తాడని చిరుపై అభిమానాన్ని బయటపెట్టాడు. ఒకసారి ఎన్‌టీఆర్ విషయంలో కూడా అలాగే జరిగిందని గుర్తుచేసుకున్నాడు. ఒక షూటింగ్ సమయంలో ఎన్‌టీఆర్, శివాజీ బాగా క్లోజ్ అయిపోవడం చూసి నచ్చని కొందరు వారి మధ్య కూడా మనస్ఫర్థలు వచ్చేలా చేశారన్నారు. తాను తప్పు చేస్తే వాళ్ల దగ్గరకి వెళ్లి చెప్పుకునేవాడిని అని, తప్పు చేయకపోయినా ఎవరో చెప్పింది విని తనను దూరం పెట్టారని వాపోయారు.


Also Read: నా భార్యది రాజకీయ కుటుంబం, పెళ్లికి ముందే ఆ కండీషన్ పెట్టాను - ‘బిగ్ బాస్’ శివాజీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial