Bigg Boss Telugu 7 Finale : బిగ్ బాస్ సీజన్ 7లో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు శివాజీ. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో శివాజీలాగా మైండ్ గేమ్ ఎవరు ఆడలేదని ఇతర కంటెస్టెంట్స్ కూడా ఒప్పుకున్నారు. సీజన్ మొదట్లో శివాజీనే విన్నర్ అని ప్రేక్షకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారు. కానీ అనుకోకుండా టాప్ 3వ కంటెస్టెంట్‌గా మిగిలిపోయి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చేశాడు శివాజీ. తను ఎలిమినేట్ అయ్యాడు అని ప్రకటన రాగానే.. తన కొడుకు రిక్కీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ అయితే శివాజీ కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చాడు.


శివాజీని గురువుగా భావించి బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడూ తన వెంటే ఉన్నాడు పల్లవి ప్రశాంత్. అందుకే శివాజీ హౌజ్ నుండి వెళ్లిపోతుంటే తన కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. అయితే తాను జీవితంలో చాలా చూసేసానని, అందుకే మీరే ఉండాలి అని ప్రశాంత్‌తో అన్నాడు శివాజీ. అమర్, ప్రశాంత్‌లో కూడా ఎవరో ఒక్కరే గెలుస్తారని, ఇద్దరు గెలవలేరని అన్నాడు. తను చేసిన తప్పులకు శివాజీకి సారీ చెప్పాడు అమర్. అలా చెప్పాల్సిన అవసరం లేదని ఓదార్చాడు శివాజీ. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చేస్తూ కూడా.. తనకు హౌజ్ చాలా నేర్పించిందని, ఏం చేసినా కడుపులో పెట్టుకొని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ.. బయటికి వెళ్లాడు.


స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అని అన్నాడు. అంతే కాకుండా బయట ప్రపంచంలో నేర్చుకోలేని విషయాలు 105 రోజుల్లో ఇంట్లో నేర్చుకోవచ్చని తెలిపాడు. తన కొడుకులను కూడా స్టేజ్‌పైకి రమ్మన్నాడు. స్టేజ్‌పైకి రాగానే తన చిన్న కొడుకు రిక్కీ.. శివాజీని పట్టుకొని ఏడ్చాడు. ఇది ఓడిపోతే.. దీనికంటే పెద్దది ఏదో గెలుస్తామని అర్థమని కొడుకును ఓదార్చాడు శివాజీ. తన పెద్ద కొడుకును చూసి చాలా బ్యాలెన్స్‌డ్ మనిషి అని నాగార్జున ప్రశంసించారు. ఆ మాటకు శివాజీ కూడా ఒప్పుకున్నాడు. చిన్న కొడుకుకు మాత్రం తనలాగా తొందర ఎక్కువ అని అన్నాడు. ఇక శివాజీ తన జీవితంలో మరెన్నో సాధించాలని చెప్తూ.. నాగార్జున తనను పంపించారు.


Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?


రాజకీయ విశ్లేషకుడిగా అనుభవం ఉన్న శివాజీ.. బిగ్ బాస్ విశ్లేషకుడిగా మారి.. అన్ని సీజన్స్ చూసి, అంతా తెలుసుకునే హౌజ్‌లోకి ఎంటర్ అయినట్టు మొదటినుండే ప్రేక్షకులకు అనుమానం కలిగింది. అసలు ఆడియన్స్‌ను ఎలా ఎంటర్‌టైన్ చేయాలి అనే విషయంలో శివాజీ ఏమైనా పీహెచ్‌డీ చేశాడా అని చాలామందికి అనిపించింది. ఎంత సీరియస్ టాస్కులో కూడా ఎంటర్‌టైన్మెంట్ తీసుకొచ్చి.. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేవాడు శివాజీ. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుండే అందరూ ఒకలాగా ఆలోచిస్తే.. నేను ఇలా ఎందుకు చేయకూడదు అని అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దీంతో శివాజీ ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే టాప్ 3గా మిగిలిపోవడం తన ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.