Bigg Boss 7 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొత్తలో అనూహ్యంగా లేడీ కంటెస్టెంట్స్ బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ అయిపోయారు. ఏడు వారాలు వరుసగా అలాంటి ఎలిమినేషన్ జరిగిన తర్వాత 8వ వారంలో మగవారి ఎలిమినేషన్ మొదలయ్యింది. అలాంటి ఎలిమినేషన్స్ అన్నీ దాటుకుంటూ ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్ ఫైనల్స్ వరకు వెళ్లింది. తనే ప్రియాంక జైన్. హౌజ్‌లో ఎప్పుడూ అందరికీ వంటలు చేసి పెడుతూ.. ఎక్కువగా పాజిటివ్ పేరు సంపాదించుకున్న ప్రియాంకలో చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్‌పైనే ప్రేక్షకులు ఫోకస్ పెట్టడం వల్ల తను విన్నర్ అవ్వకుండా బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చింది.


తరువాత ఎలిమనేట్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరో చెప్పడం కోసం మాస్ మహారాజ్ రవితేజను పిలిచారు రవితేజ. తన చేతుల మీదుగా ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. ఒక ఆడపిల్ల తన వల్ల ఎలిమినేట్ అవ్వడం బాధగా ఉందని చెప్పి రవితేజ వెళ్లిపోయాడు. ఇక ప్రియాంక.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి స్టేజ్‌పైకి వచ్చింది. బిగ్ బాస్‌ విషయంలో తన వల్ల తనకు గర్వంగా ఉందని, తన వల్ల తన కుటుంబ సభ్యులు కూడా గర్వపడుతున్నారని సంతోషంగా చెప్పింది. తను ఇంతవరకు ఉంటానని అనుకోలేదని, స్ట్రాంగ్ అయ్యానని చెప్పింది. కండలు వచ్చాయని జోక్ చేసింది. తన గేమ్ మాత్రమే కాదు.. తన ప్రవర్తన కూడా చాలా బాగుందని, తనను చూసి గర్వపడుతున్నానని ప్రియాంక తండ్రి స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


బిగ్ బాస్ సీజన్ 7లో ఎన్నో టాస్కులు చివరివరకు వచ్చి ఓడిపోయిన కంటెస్టెంట్స్‌లో ప్రియాంక ఒకరు. సీజన్ ప్రారంభమయిన కొత్తలో ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటూ.. నెగిటివిటీగా దూరంగా ఉంది ప్రియాంక. కానీ శోభాతో సావాసం మొదలయ్యి.. తనతో ఫ్రెండ్‌షిప్‌లో దగ్గరయ్యి.. తనకోసం పలుమార్లు స్టాండ్ తీసుకోవడం వల్ల ప్రియాంకకు నెగిటివిటీ ఏర్పడింది. మెల్లగా ఆ నెగిటివిటీ ఎక్కువయ్యింది కూడా. దానివల్లే ఫైనల్స్ వరకు వచ్చినా కూడా ప్రియాంక ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. టాప్ 5 వరకు చేరుకొని ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉండగా.. బిగ్ బాస్ హౌజ్ నుండి ప్రియాంక బయటికి వచ్చేసింది.


హైట్ తక్కువ ఉన్న అమ్మాయిలకు పొట్టి అని ట్యాగ్ ఇవ్వడం అందరికీ అలవాటు అయిపోయింది. అలాగే ప్రియాంకకు కూడా పొట్టి ప్రియాంక అని పేరు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. తన క్యూట్ లుక్స్‌లో హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే చాలామందిని ఫిదా చేసేసింది ఈ పొట్టి పిల్ల. ఎక్కువగా ఎవరితో గొడవపడకుండా, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడమే ప్రియాంక నైజం అని బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొన్నిరోజుల్లోనే చూసే ప్రేక్షకులకు అర్థమయ్యింది. తనకు ఇచ్చిన హౌజ్ వర్క్ చేయడం, టాస్కులు ఆడడం, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం.. కొన్నాళ్ల వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఇదే ప్రియాంక రొటీన్. హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తానే కిచెన్ బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించింది. అంతమందికి ఏ మాత్రం విసుగులేకుండా వండిపెట్టేది. తనకు ఎవరూ సాయం చేయకపోయినా.. ఒంటరిగానే చాలాసార్లు అందరికీ వంట చేసి పెట్టింది ప్రియాంక. అలా చాలామందికి తనంటే అభిమానం ఏర్పడింది.