Pallavi Prashanth Released From Jail: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు కేసు నుంచి కాస్త ఊరట లభించింది. బిగ్ బాస్ తాజా సీజన్ ఫైనల్స్ రోజు స్టూడియో బయట జరిగిన అల్లర్ల కేసులో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వెంటనే తన లాయర్ స్పందించి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ముందుగా దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి హైకోర్టు కొట్టిపారేసింది. కానీ రెండోసారి దాఖలు చేసిన పిటీషన్‌ను అంగీకరించి.. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ అందించింది. తనకు శుక్రవారం బెయిల్ మంజూరు కాగా.. శనివారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. మరోసారి పల్లవి ప్రశాంత్‌ను చూడడానికి చాలామంది అభిమానులు చంచల్‌గూడ జైలు దగ్గరకు చేరుకుని గట్టిగా అరుస్తూ హల్ చల్ చేశారు.


జైలు నుండి విడుదల..
పల్లవి ప్రశాంత్ విడుదల అవుతుంటే చూడాలని.. మరోసారి తన అభిమానులంతా చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయకుండా సైలెంట్‌గా కారులో ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్తూ కొందరు ఆకతాయిలు.. కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలను మాత్రమే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీలను కూడా వారు ధ్వంసం చేశారు. రెండు పోలీస్ వాహనాలతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులపై కూడా వారు దాడి చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఇలా చేశారని తనపై పోలీసులు కేసు పెట్టారు. తాను ఏం తప్పు చేయకుండా తనపై కేసు పెట్టారంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ఏసీపీ ముందుకొచ్చారు.


పోలీసుల క్లారిటీ..
ఫైనల్స్ రోజు స్టూడియోస్ బయట చాలా గొడవ జరుగుతుందని, అందుకే పల్లవి ప్రశాంత్‌ను వేరే గేట్ నుండి పంపినట్టు పోలీసులు గుర్తుచేసుకున్నారు. అయినా కూడా ర్యాలీ చేసే తీరాలి అంటూ ప్రశాంత్ మళ్లీ వెనక్కి వచ్చాడని, ఆ సమయంలోనే గొడవ పెద్దగా అవ్వడంతో పోలీసుల కార్లపై, ఆర్టీసీ బస్సులపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారని తెలిపారు. పబ్లిక్ ప్రాపర్టీలను ధ్వంసం చేశారు కాబట్టి సూమోటోగా వారు కేసును నమోదు చేశామని అన్నారు. కేసు నమోదు చేయడంతో పాటు తరువాతి రోజు తన ఇంటికి వెళ్లి మరీ ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరచి ప్రశాంత్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాలుగు రోజులు జైలు శిక్షను అనుభవించిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


షరతులతో కూడిన బెయిల్..
పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ను మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. దాంతో పాటు పలు షరతులను విధించింది. ప్రతీ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు ప్రశాంత్ హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా రూ.15 వేల చొప్పున రెండు షురిటీలను వారికి సమర్పించాలని చెప్పింది. జైలుకు వెళ్లొచ్చినా కూడా పల్లవి ప్రశాంత్‌ది ఏమీ తప్పు లేదని తన అభిమానులు అంటున్నారు. అందుకే తనను చూడడానికి చంచల్‌గూడ జైలు వద్దకు భారీగా ఫ్యాన్స్ తరలివచ్చినా.. ఈసారి అలాంటి అల్లర్లు ఏమీ జరగకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. అయినా కూడా ప్రశాంత్‌తో మాట్లాడాలంటూ, ఫోటో కావాలంటూ పలువురు ఆకతాయిలు తను కారు వెంట పరిగెత్తారు.


Also Read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో భార్యభర్తల లొల్లి - అందరి ముందు భార్యను కొట్టబోయిన భర్త