బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయ్యింది నయని పావని. వచ్చి వారం రోజులే అయినా కంటెస్టెంట్స్ అందరిలో మంచి రిలేషన్‌సిప్‌ను ఏర్పరుచుకుంది. అందుకే తను ఎలిమినేట్ అయ్యిందని తెలియగానే కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ హౌజ్‌లో ఎక్కువగా కంటతడి పెట్టని శివాజీ కూడా నయని వెళ్లిపోతుందని తెలియగానే ఏడవడం మొదలుపెట్టారు. అసలు తను ఎలిమినేట్ అవుతుందని కంటెస్టెంట్స్ ఎవరూ ఊహించలేదు, తను కూడా ఊహించలేదు కాబట్టే బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లే ముందు వెక్కివెక్కి ఏడ్చింది. ఇక బయటికి వచ్చిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో తన గేమ్ గురించి పలు వ్యాఖ్యలు చేసింది నయని పావని.


నేనేం ఫీల్ అవ్వట్లేదు..
బిగ్ బాస్ హౌజ్‌లోకి గెస్ట్‌లాగా వెళ్లి వచ్చింది అంటూ నయని పావనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం మొదలయ్యింది. దీంతో గీతూ కూడా మెరుపు తీగలాగా హౌజ్‌లోకి వెళ్లొచ్చింది అంటూ నయని పావనికి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇంట్రడక్షన్ ఇచ్చింది. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో తనకు అశ్విని శ్రీ, భోలే షావలి నచ్చలేదంటూ వారి ఫోటోలపై రెడ్ మార్క్ వేసింది. అశ్విని బ్రెయిన్‌లెస్ అంటూ కామెంట్ కూడా చేసింది. భోలేను డోలా అంటూ కామెంట్ పాస్ చేసింది. ‘‘10 వారాల తర్వాత ఊహించాం మీ ఎలిమినేషన్. ఇప్పుడు మీరు ఎలా ఫీలవుతున్నారు’’ అని అడగగా.. ‘‘ఏం లేదు. నేనేం ఫీల్ అవ్వట్లేదు’’ అని నీరసంగా సమాధానమిచ్చింది నయని పావని.


తేజతో కావాలనే గొడవలు..
‘‘తేజకు మీరు యాంటీగా ఉండాలనే హౌజ్‌లోకి వెళ్లారా, తేజతో కావాలని గొడవ క్రియేట్ చేసుకోవడానికి వెళ్లారేమో అనిపించింది’’ అని నయని పావని, తేజ మధ్య గొడవలను ఉద్దేశించి అడిగింది గీతూ. దానికి నయని పావని.. ‘‘లేదు. ఒకవేళ మీకు అలా అనిపించి ఉండవచ్చు’’ అని చెప్పింది. ‘‘నువ్వు గట్టిగా నామినేట్ చేసానని అనుకుంటున్నావా’’ అని అడగగా.. ‘‘ఏమో నేను అయితే అనుకుంటున్నాను’’ అని చెప్పింది నయని. ‘‘నువ్వు కాకుండా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నావు’’ అనే ప్రశ్నకు ఐశ్వర్య అని సమాధానమిచ్చింది. అయితే అది ఐశ్వర్య కాదక్కా అశ్విని అని గీతూ నవ్వుతూ చెప్పింది. ‘‘అవును అశ్విని. నాకు పేర్లతో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది’’ అని నయని క్లారిటీ ఇచ్చింది.


కన్ఫ్యూజన్‌లో లేను..
‘‘చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నావు. నీ ఆట కూడా అలా ఉంది కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నావు’’ అంటూ వ్యాఖ్యలు చేసింది గీతూ. ‘‘లేదు. నేను చాలా కన్ఫ్యూజన్‌లో లేను’’ అని సమాధానమిచ్చింది నయని. అసలు బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించగా.. ‘‘నా గేమ్ నేను ఆడాను’’ అంది నయని పావని. ఏం గేమ్ ఆడావు అని గీతూ అడిగితే ఏం గేమ్ ఆడలేదు అని నయని ఎదురుప్రశ్న వేసింది. ఒకటైనా గెలిచావా అని గట్టిగా అడిగింది గీతూ. ‘‘నాకు తెలియదు’’ అని తేలికగా చెప్పేసింది నయని. ‘‘నయని హౌజ్‌లో ఏం చేయలేదని ఈ మౌనమే సమాధానం చెప్తోంది’’ అని కామెంట్ చేసింది గీతూ. ‘‘ఆ మౌనం మీకు అలా అర్థమయితే నేనేం చేయలేను’’ అని తనను తాను సమర్ధించుకుంది నయని. శివాజీతో కనెక్షన్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఇంకా కొన్ని వారాలు ఉంటుంది అనుకున్నాను అని బయటపెట్టింది. ‘‘ఆడియన్స్‌తో కనెక్ట్ అవుదామని వచ్చిన నయని హౌజ్‌మేట్స్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యింది’’ అని గీతూ చెప్పిన మాటకు నయని ఒప్పుకుంది.



Also Read: దామిని, రతిక, శుభశ్రీలలో రీ-ఎంట్రీ ఇచ్చేది ఎవరు? ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial