బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నింటిలో ఒకటి తర్వాత ఒకరుగా అందరూ లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయిపోతున్నారు. బిగ్ బాస్ హౌజ్ అంతా ఇప్పుడు బాయ్స్ హాస్టల్‌లాగా అయిపోయిందని ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతుందని ముందు నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ముందుగా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో నయని పావని ఎలిమినేట్ అని వార్తలు వచ్చాయి. ఇక ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి అదే జరిగింది. నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. నయని పావని బదులు తనను బయటికి పంపేయని శివాజీ అడగగా.. తనకోసం కూడా గేట్లు తెరుచుకున్నాయి.


శివాజీ ఓదార్పు..
నయని పావని, అశ్విని శ్రీ.. ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఇక నయని పావని ఎలిమినేట్ అయిపోతుంది అని అనౌన్స్‌మెంట్ రాగానే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తన ఏడుపును హౌజ్‌మేట్స్ సైతం కంట్రోల్ చేయలేకపోయారు. తను పూర్తిగా ఎలిమినేట్ అవ్వలేదేమో, ఇంకా ఏదో ఉంటుందేమో అని తేజ సైతం తనకు ధైర్యం చెప్పబోయాడు. ఒక్క ఆట కూడా సరిగా ఆడలేకపోయానని బాధగా ఉందని నయని బాధపడింది. శివాజీ తనను పక్కకు తీసుకెళ్లి.. ‘‘నువ్వు చాలా స్ట్రాంగ్. నయని ఏడవద్దు’’ అని ధైర్యం చెప్పాడు. తనకోసం గేట్లు తెరిచే వరకు ఉన్నాడు. ‘‘సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఇక్కడ వరకు వచ్చాను’’ అని నయని వెళ్లాక అన్నాడు.


అందరి గురించి ఒక్కమాటలో..
నయని పావని ఎమోషనల్‌గానే స్టేజ్‌పైకి వచ్చింది. ‘‘నువ్వు బయట నుండి చూసినప్పుడు ఏమనుకున్నావు, హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత ఏమనుకున్నావు’’ అంటూ అందరి గురించి నయని అభిప్రాయాన్ని అడిగారు నాగార్జున. ముందుగా శోభా శెట్టి గురించి చెప్తూ.. ‘‘ముందుగా హౌజ్‌లోకి వెళ్లగానే శోభాతోనే గొడవపడతానని అనుకున్నాను. కానీ తను చాలా స్వీట్. గడుసు, మొండిలాగా అనిపిస్తుంది కానీ చాలా ప్రేమ ఉంటుంది.’’ అని చెప్పింది నయని. ‘‘ప్రియాంక అయితే ఇంట్లో అందరికీ ఓపికగా వంట చేసిపెడుతుంది. అప్పుడప్పుడు చిన్నగా కోపం వస్తుంది కానీ ఎందుకంటే అందరికీ చేసిపెట్టాలి అనే ఉద్దేశ్యంతోనే’’ అని ప్రియాంక గురించి మాట్లాడుతూ ఐ లవ్ యూ కూడా చెప్పింది. ‘‘అమర్ నాకు ఎప్పటినుండో తెలుసు. నా ఫస్ట్ మూవీ హీరో. వాడి ఫస్ట్ మూవీ హీరోయిన్ నేను. బాగా ఫైర్ ఉంది వాడిలో. కానీ భయపడతాడు బాగా. నేను వచ్చినప్పటి నుండి వాడికి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చెప్పాను కూడా. నువ్వు చాలా స్ట్రాంగ్ అమర్. లాస్ట్ వరకు ఉండాలి. అందరు చెప్పింది గుర్తుపెట్టుకో. తడబడకు’’ అని అమర్‌దీప్‌కు మిస్ యూ చెప్పింది నయని పావని. తేజ నన్ను అమ్మ, అమ్మ పిలుస్తాడు అని, ఎప్పుడూ తిన్నావా అని అడుగుతూ ఉంటాడు అని తేజ గురించి చెప్పుకొచ్చింది. తనతో బాగా కనెక్ట్ అయ్యానని బయటపెట్టింది. సొంత అక్క తర్వాత పూజాను అక్కలాగా ఫీల్ అయ్యానని ఎమోషనల్ అయ్యింది నయని. టాప్ 5కు వచ్చినప్పుడు సందీప్‌తో డ్యాన్స్ చేద్దామని అనుకున్నట్టు చెప్పింది. అర్జున్‌ తనకు పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అని ట్యాగ్ ఇచ్చింది. గౌతమ్‌తో కావాలని జోకులు వేయడం, ఏడిపించడం ఇష్టమని బయటపెట్టింది. పల్లవి ప్రశాంత్‌తో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేదాన్ని అని చెప్తూ ఏడ్చేసింది నయని. 


శివాజీ, నయని బాండింగ్..
అందరి గురించి చెప్పిన తర్వాత శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పడం మొదలుపెట్టింది నయని పావని. మా డాడీ అంటూ పిలిచింది. ‘‘నేను అసలు ఊహించలేదు అలా కనెక్ట్ అవుతానని. చూస్తే ఏడుపొచ్చేది. హగ్ చేసుకోవాలని అనిపించేది. కానీ నాకు అంత చనువు లేదు. చాలా మంచివాళ్లు. నాకు కూతురు లేదు. నన్నే డాడి అని పిలువు. నన్నే డాడి అనుకో అన్నారు. రోజూ నిద్ర లేవగానే హగ్ చేసుకునేదాన్ని. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మా డాడీనే గుర్తొస్తారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను’’ అని ఏడ్చేసింది. ఆ మాటలు విన్న శివాజీ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘‘నా చేయి బాలేదు. బ్యాక్ కూడా హర్ట్ అయ్యింది. తన బదులు నేను బయటికి వెళ్లొచ్చా.’’ అని నాగార్జునను అడిగారు శివాజీ. ఇంత చిన్న ఏజ్‌లో నాకు అంత కాన్ఫిడెన్స్ లేదని నయనిని ప్రశంసించారు. తన బదులు నేను వెళ్లిపోతా మనస్ఫూర్తిగా అని అన్నారు. అయితే శివాజీ అడిగినట్టుగానే బిగ్ బాస్ తనకోసం గేట్లు తెరిచినట్టుగా, శివాజీ బయటికి వెళ్లిపోయినట్టుగా ప్రోమోలో చూపించారు. ప్రేక్షకులు మాత్రం.. అదంతా డ్రామా కావచ్చని.. ఆయన చేతికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకే బిగ్ బాస్ బయటకు తీసుకెళ్లి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. లేదా నయనీ పావనీని వెనక్కి తీసుకురావాలనే శివాజీ రిక్వెస్టుపై ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.  అసలు నిజం ఏమిటనేది సోమవారం ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది.