బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా పవర్ అస్త్రాల కోసం పోటీలు జరిగాయి. హౌజ్‌లోకి ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్.. ఎంటర్ అయినప్పటి నుంచి పవర్ అస్త్రాను సాధించాలి అనే లక్ష్యంతోనే ముందుకు వెళ్లారు. కానీ వారందరిలో కేవలం నలుగురికి మాత్రమే పవర్ అస్త్రాలు దక్కాయి. ఇంతలోనే ఇక పవర్ అస్త్రాల కోసం పోటీ ముగిసిందని, కెప్టెన్సీ కోసం పోటీ మొదలవుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. అలా మొదటి కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించి బిగ్ బాస్ సీజన్ 7కు మొదటి కెప్టెన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఇక సెకండ్ కెప్టెన్సీ అయినా తమకు దక్కాలి అని ఇతర కంటెస్టెంట్స్ అనుకుంటున్న సమయంలోనే వారికి పోటీగా కొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు.


పోటుగాళ్లుగా ఆ ఆరుగురు


ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే వీరు హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే నాగార్జున వీరికి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం పాత కంటెస్టెంట్స్‌తో పోటీపడ్డారు. దీంతో ఈ అయిదుగురి ప్రవర్తన ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులకు పెద్దగా సమయం పట్టలేదు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్‌కు పోటుగాళ్లు అని పేరుపెట్టారు బిగ్ బాస్. ఇక ఆరు వారాల నుంచి హౌజ్‌లో ఉన్న పాత కంటెస్టెంట్స్‌కు ఆటగాళ్లు అని పేరుపెట్టారు. దీంతో పోటుగాళ్లుగా సత్తా చాటడం కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సిద్ధమయ్యారు.


పోటుగాళ్లు టీమ్‌కు లీడర్లుగా అర్జున్, గౌతమ్


అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోలే షావలితో పాటు సీక్రెట్ రూమ్ నుంచి తిరిగొచ్చిన గౌతమ్ కూడా పోటుగాళ్ల టీమ్‌లోనే జాయిన్ అయ్యాడు. ఎందుకో తెలియదు కానీ గౌతమ్, అర్జున్.. వెంటనే తాము పోటుగాళ్లు టీమ్‌కు లీడర్స్ అన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఏ టాస్క్‌లో ఎవరు ఆడాలి, ఎవరు ఆడితే గెలుస్తారు అని నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని భోలే షావలి కూడా నాగార్జునతో చెప్పాడు. అయితే అర్జున్ ప్రవర్తన ఎలా ఉన్నా.. అర్జున్, గౌతమ్ కలిసి పోటుగాళ్లు టీమ్‌ను గెలుపుకు దగ్గర వరకు తీసుకెళ్లగలిగారు. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అంటూ జరిగిన ఏడు టాస్కులలో బ్యాక్ టు బ్యాక్ మూడు టాస్కులు గెలవగలిగింది పోటుగాళ్లు టీమ్.


నయని పావని బిల్డప్


అర్జున్, గౌతమ్ తప్పా మిగతా పోటుగాళ్లు టీమ్ పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. పూజా, నయని పావని, అశ్వినిలకు ఆడే అవకాశాలు వచ్చినా వారు ఒక్కదానిలో కూడా వారి ఆటను, బలాన్ని చూపించుకోలేకపోయారు. నయని పావని మాత్రం హడావిడిగా అటుతిటు తిరుగుతూ.. తానే అన్ని చేసేశాను అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం తప్పా చేసిందేమి లేదు అని ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. అశ్విని అయితే వచ్చిన రెండోరోజు నుండే ఏడుపు మొదలుపెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. పూజా మూర్తి కూడా సందర్భానికి తగినట్టుగా మాట్లాడడం రాక అందరితో గొడవలు పెట్టుకుంటోందని ఆడియన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా ప్రేక్షకుల దృష్టిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై ఒక అభిప్రాయం ఏర్పడింది.


Also Read: దామిని, రతిక, శుభశ్రీకి మరో అవకాశం - ఎక్కువ ఓట్లతో హౌజ్‌లో రీఎంట్రీ ఇచ్చేది ఎవరంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial