ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న మిడ్ వీక్ ఎలిమినేషన్ రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియడానికి ఇంక రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 5 కంటెస్టెంట్లు మిగులుతారు. వారిలో ఒకరు విన్నర్ గా నిలుస్తారు. ప్రస్తుతం ఇంట్లో రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య మిగిలారు. ఈరోజు ఎలిమినేషన్ కి సంబంధించి ప్రోమో వదిలారు.


తాజా ప్రోమో ప్రకారం అందరూ నిద్రపోతుండగా బిగ్ బాస్ కుక్కల అరుపు శబ్ధం పెట్టి నిద్రలేపాడు. ఏమైందో ఏంటో అని అందరూ కంగారుగా గార్డెన్ ఏరియాలోకి వచ్చి నిలబడ్డారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోందని ఇంటి సభ్యులందరిని తమ బ్యాగులు సర్దుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఆ మాటకి అందరూ వెళ్ళి బ్యాగులు సర్దుకున్నారు. 15 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య టాప్ 6 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఇప్పుడు టాప్ 5లో అనర్హులని ఎవరు అనుకుంటున్నారో ఒక్కొకరు తమ అభిప్రాయం చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. శ్రీహాన్ రోహిత్ పేరు చెప్పగా, కీర్తి అదిరెడ్డి, శ్రీసత్య కీర్తి పేరు చెప్పింది. రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి కూడా కీర్తి పేరే చెప్పినట్టుగా తెలుస్తోంది.


ఇంటి సభ్యులందరూ కీర్తి టాప్ 5లో అనర్హురాలిగా భావించి బయటకి వెళ్లాలని చెప్పారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం.. టాప్ 5 కి చేరుకోకముందే ఇంటి నుంచి బయటకి వెళ్తున్న సభ్యులు అని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే, ఇంటి సభ్యులు టార్గెట్ చేసుకున్న కీర్తికి బదులుగా మరొకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీసత్య బయటకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.



ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో నెగిటివిటీ మూటకట్టుకున్న అమ్మాయి శ్రీసత్య. ఇనాయను, కీర్తిని ఆమె వ్యక్తిగతంగా దాడి చేసి బాధపడేలా చేసింది. ముఖ్యంగా ఫిజికల్ గా వెక్కిరించడం, అర్జున్ కళ్యాణ్‌ను ఆట కోసం వాడుకోవడం కూడా చాలా చికాకు పుట్టించింది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీసత్య, ఆదిరెడ్డి ఓటింగ్ లో కింద ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారందరికీ వీరి కన్నా ఎక్కువగానే ఓటింగ్ వచ్చిందని సమాచారం. ఆదిరెడ్డికి అంత నెగిటివిటీ లేదు, అందుకే ఆయన్ను ఉంచి శ్రీసత్యను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. 


విజేత ఆయనేనా?


బిగ్ బాస్ 6 విజేత అయ్యే అవకాశం రేవంత్‌కే ఉందని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ మధ్యలో రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి నాలుగు వారాలుగా రోహిత్ గ్రాఫ్ కూడా పెరిగింది. రేవంత్ బాగా ఆడినా.. ఉడుకుమోతుతనం, కోపం, ప్రతి దానికి గొడవలు పడడం, ఓటమిని తీసుకోలేకపోవడం, చీటికి మాటికి అరవడం ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకును కలిగిస్తున్నాయి. ఇక రోహిత్ నిదానంగా ఆడుతున్నాడు. భావోద్వేగాల విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటున్నాడు. ఎవరినీ ఇంతవరకు బాధపెట్టలేదు. రేవంత్‌లా బట్టలు చించుకుని ఆడడం లేదు. కానీ, ఉన్నంతలో తన నేచర్‌ను బట్టి బాగానే ఆడుతున్నాడు. బిగ్ బాస్ అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట. ఇందులో గెలవాలంటే ఫిజికల్ టాస్కులు గెలిస్తే సరిపోదు, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకుని నిలబడాలి. ఇలా చూసుకుంటే రోహిత్, రేవంత్ కన్నా చాలా బెటర్ అనిపిస్తాడు. 


Also Read: బిగ్‌బాస్ విన్నర్ పేరు చెప్పేసిన గూగుల్ - గతంలో కూడా ఇలానే చెప్పింది