Bigg Boss 6 Telugu: బరువైన విషాదాన్ని మోయడం అంత సులువు కాదు, అందులోనూ ప్రపంచంలో తన వారంటూ లేకుండా ఒంటరిగా మిగలడం జీవితాంతం వెంటాడే విషాదం. అదే విషాదాన్ని గుండెల్లో గత ఏడేనిమిదేళ్లుగా మోస్తోంది కీర్తి. ఆమె ముఖంలో ఎప్పుడు ఆ బాధ కనిపిస్తుంది. కనీసం తన కంటూ ఒక్కరూ కుటుంబంలో మిగలకుండా యాక్సిడెంట్లో చనిపోవడం ఆమెను ఇప్పటికీ తీవ్ర వేదనకు గురిచేస్తోంది.ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తనకోసం రావడానికి ఎవరూ లేకపోవడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది.కాగా ఈ తాజా ఎపిసోడ్లో ఆమె ఒంటరితనాన్ని చాలా అందంగా పొగిడారు బిగ్ బాస్. 


సీజన్ 6 మరో నాలుగు రోజుల్లో ముగుస్తుండడంతో ఇంట్లో ఉన్న ఆరుగురి సభ్యుల జర్నీ వీడియోలను ప్లే చేశారు బిగ్ బాస్. రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రోహిత్ వీడియోలు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక ఎపిసోడ్లో శ్రీహాన్, కీర్తి వీడియోలు వేశారు. ఇందులో కీర్తి వీడియో మామూలుగా లేదు. బిగ్ బాష్ మాటలు విని కీర్తి చాలా ఆనందపడింది. మొదటగా ఫోన్ కాల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ ఆమె మాట్లాడాడు. తరువాత బిగ్ బాస్ మాట్లాడుతూ ‘కీర్తి, నిజజీవితం కల్పితం కన్నా ఎంతో నాటకీయమైనది. ఒకవైపు బరువుైన గతం మిమ్మల్ని లోపల నుంచి దహిస్తుంటే, మీరు చూపించిన నిబ్బరం ఎంతో మందికి స్పూర్తి. అడవిలో మహా వ‌ృక్షం ఒకటే ఉంటుంది. తాను ఒంటరినని బాధపడి తలవంచితే ఆకాశాన్ని తాకే తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లు దొరక్క కలవర పడ్డారు. సింపథీ కోసమే మీ ప్రయ్నం అని మిగిలిన వాళ్లు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. కానీ మీ ఆట ఆగలేదు. మీ కుటుంబ సంఖ్య ఒకటి కాదు, కొన్ని లక్షలు. కష్టాల పునాదులపై నిర్మించిన విజయాన్ని కదపడం అంత సులభం కాదు’ అన్నారు బిగ్ బాస్. 


అందంగా లేనని...
కీర్తి బిగ్ బాస్ మాటలకు చాలా ఎమోషనల్ అయింది. ‘యాక్సిడెంట్లో నా కుటుంబం మొత్తం చనిపోయారు. నేను కోమాలోకి వెళ్లాను. కళ్లు తెరిచే సరికి నా వాళ్లు ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉండకూదని పాపను దత్తత తీసుకున్నా, ఆ పాపని కూడా దేవుడు దూరం చేశారు. పోనీ ఒక పాపని కనొచ్చు అనకుంటే ఆ అవకాశం కూడా లేదు. యాక్సిడెంట్లో పొట్టకి గాయం అవ్వడంతో గర్భసంచి తీసేశారు’ అంటూ ఏడ్చింది కీర్తి. అంతేకాదు తనను కాదని వెళ్లిన వాళ్లకి సమాధానం ఇచ్చింది కీర్తి. ‘ఎవరు నన్ను ఛీ తూ అని వదిలివెళ్లారో, అందంగా లేనని అన్నారో, బయటకు గెంటేశారో, నువ్వు వద్దు అని దూరం పెట్టారో వారందరికీ చెబుతున్నా ఇదే కీర్తి అంటే’ అని ఎమోషనల్ గా చెప్పింది కీర్తి. 


శ్రీహాన్ జర్నీ...
కీర్తి కన్నా ముందు శ్రీహాన్ జర్నీ చూపించారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలోకి రాగానే అక్కడున్న ఫోటోలను చూసాడు శ్రీహాన్. అక్కడ ఇనాయ, కీర్తి ఫోటోలు కూడా ఉన్నాయి. వారిద్దరికీ సారీ చెప్పాడు. తరువాత తల్లితో ఫోన్లో మాట్లాడాడు. ‘బిగ్ బాస్ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో గత సీజన్లో దగ్గర నుంచి చూశారు. ఈసారి మీరే స్వయంగా అనుభవాన్ని పొందేందుకు ఇంట్లోకి అడుగుపెట్టారు. అందరితో సరదాగా ఉండడం, అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా ఎదిరించడం మీలో ఉన్నాయి. మీలోని అల్లరి మీకు స్నేహితులను తీసుకొచ్చింది. మీరు తోటి ఇంటి సభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు’ అంటూ పొగిడారు బిగ్ బాస్. తరువాత అతని జర్నీ వీడియోను ప్రదర్శించారు. 


Also read: ఓట్ల కోసం సీనియర్ ఎన్టీఆర్‌ని వాడేసిన శ్రీహాన్, ఎడిటింగ్ మాత్రం అదిరిపోయింది