Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Season 7) ఫైనల్స్ రోజు జరిగిన గొడవలో పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు తన సోదరుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. దాదాపు ఆరు గంటల పాటు ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్‌తో పాటు తన సోదరుడిని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. కేసు విచారణ తర్వాత వారిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్‌, అతడి సోదరుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


ఈ విషయంపై ఏసీపీ హరిప్రసాద్.. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ‘‘బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌లో పల్లవి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సందర్భంగా రోడ్ నెంబర్ 5లో పెద్ద ఎత్తున గుంపు చేరుకున్నారు. ఆ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని అతడిని వేరే గేట్ ద్వారా నిర్వాహకులు బయటికి పంపించారు. అయినా అతడు వినకుండా మళ్లీ రోడ్ నెంబర్ 5 నుంచి తిరిగి అన్నపూర్ణ స్టూడియో పరిసరాలకు వచ్చాడు. అప్పుడు పోలీసులు అటువైపు వెళ్లొద్దని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పాం. కానీ అతడు వినకుండా పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగాడు. అప్పుడు అతడితో పాటు ఉన్నవాళ్లు అక్కడ ఉన్న రెండు పోలీస్ వాహనాలు డ్యామేజ్ చేశారు. అవి బందోబస్త్ కోసం వచ్చిన వాహనాలు’’ అని ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరించారు.


‘‘ఆ సంద్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/22(3) అండర్ సెక్షన్ 147, 148 290, 353, 427 విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీ యాక్ట్ సెక్షన్స్ కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సూమోటోలో కేసు నమోదు చేశాం. 19వ రోజు నేరస్థులు అయిన సాయి కిరణ్, అంకెరావుపల్లి రాజు.. వాళ్లు ఆరోజు వాహనాలు నడిపిన డ్రైవర్స్‌ను అరెస్ట్ చేశాం. అదే విధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు మనోహర్‌ను కూడా అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశాం. మెజిస్ట్రేట్.. వారికి 14 రోజులు రిమాండ్ విధించారు’’ అని క్లారిటీ ఇచ్చిన ఏసీపీ హరిప్రసాద్. అయితే వీరితో పాటు ఇంకా చాలామందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, వారు ఎవరు అని సీసీ ఫుటెజ్‌ను పరిశీలించిన తర్వాత ఫైనల్ అవుతుందో తెలుస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని తెలిపారు.


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లను ధ్వంసం చేయడంతో పాటు పోలీస్ కార్లపై కూడా దాడులు జరిపి.. ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేయడంతో పోలీసులు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వద్దని చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ వెనక్కి వచ్చినందుకే గొడవ పెద్దగా అయ్యిందని, అందుకే తనపై కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ కేసు ఇంకా ముగిసిపోలేదని, ఇంకా చాలా అరెస్టులు జరిగే అవాకాశం ఉందని ఏసీపీ క్లారిటీ ఇచ్చారు. సీసీటీవీ వీడియోల ద్వారా మరింత మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని అన్నారు.


Also Read: నా బిడ్డ గెలిచాడు, అలా అనుకోవడం పరమ బూతు - బిగ్ బాస్‌పై శివాజీ వ్యాఖ్యలు