ఇనయా సుల్తానా ఎవరు? ఇదే ప్రశ్న బిగ్‌బాస్ సీజన్ 6కు ముందు అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానం ‘తెలియదు’. కానీ ఇప్పుడు అడిగితే బిగ్ బాస్ టైటిల్ అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చిన కంటెస్టెంట్‌గా చెప్పుకుంటారు. అయితే అంతకుమించి అన్యాయంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా కూడా వివరిస్తారు. ఎందుకంటే మొదటి వారం నుంచే ఇనయా పోరాటం మొదలైంది. గీతూలాంటి వాళ్లు టార్గెట్ చేసి నానా మాటలు అంటున్నా... ధీటుగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకానొక సమయంలో హౌస్ అంతా ఒక్కటై ఇనయాను టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయంలో మరో అమ్మాయి అయితే ఇంట్లోంచి బయటికి పంపించేయమని అడిగేది. కానీ ఈమె ఆడపులిలా ఒంటరిగానే పోరాడింది. బాధనిపించినప్పుడు ఒంటరిగానే ఏడ్చింది. మళ్లీ ఒంటరిగానే తన పరుగును మొదలుపెట్టింది. ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్న 14 వారాల కాలంలో ఒక్కసారి కూడా ఇతర ఇంటి సభ్యులెవరూ ఆటలో కానీ, టాస్కుల్లో కానీ, కెప్టెన్ అయ్యేందుకు కానీ సహాయం చేయలేదు. అందుకే ఆమె ఎన్నో సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయినప్పటికీ చివరి వారం వరకు కెప్టెన్ కాలేకపోయింది. చివరికి ఎవరి సాయం లేకుండా తన కష్టంతోనే ఈ సీజన్ చివరి కెప్టెన్ అయింది.
ఒంటరి పోరాటం
ఈ సీజన్లో బాగా కష్టపడి ఆడిన కంటెస్టెంట్ ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ఇనయాదే. గీతూ, శ్రీహాన్,ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా కలిసి ఇనయాను చాలా డీగ్రేడ్ చేసేలా ఎన్నో సార్లు ప్రవర్తించారు. మనిషన్న మర్యాద కూడా ఇవ్వకుండా బిహేవ్ చేశారు. వాటన్నింటినీ తట్టుకుంది ఇనాయ. అయినా బిగ్ బాస్‌కు రాకముందే ఆమెకు ఛీత్కారాలు అలవాటై పోయాయి. అందుకేనేమో ఇంతమంది మూకుమ్మడిగా దాడి చేసినా నిలవగలిగింది. నిజం చెప్పాలంటే కొన్ని వారాల పాటూ ఈమెనే విన్నర్ అవుతుందేమో అన్న అనుమానం కూడా ప్రేక్షకుల్లో వచ్చింది. రేవంత్ - ఇనయా మధ్యే గట్టి పోటీ పడుతుందనుకున్నారు. అనధికారికంగా కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు పెట్టే ఏ ఓటింగ్లో కూడా ఇనాయకు తక్కువ ఓట్లు పడలేదు. మొదటి నాలుగు స్థానాల్లోనే ఉంది. ఒకానొక సమయంలో మొదటి స్థానానికి కూడా వచ్చింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ కన్నా ఇనాయకు ఓట్లు ఎక్కువే పడినట్టు సమాచారం. అయినా కూడా వారు నలుగురు ఇంట్లో ఉండి ఇనయా ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
అలా ఎలా?
ఇనయాకు మేం ఓటేశాం కదా... అయినా ఆమెను ఎలా ఎలిమినేట్ చేశారన్న ఆక్రోశం మొదలైంది ప్రేక్షకుల్లో. తమ బాధను ట్వీట్ల రూపంలో పంచుకున్నారు. దీంతో కొన్ని గంటల పాటూ ‘ఇనయా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్’ (#InayaUnfairElimination) హ్యాష్ టాగ్ ట్రెండయింది. ఇనయాకు ఓటేసిన ఎంతో మంది బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ట్వీట్లు చేశారు. ‘ఎన్ని వరస్ట్ సీజన్లు వచ్చినా సీజన్ 6ను బీట్ చేయలేవు. కష్టపడి ఆడిన వాళ్లు వెళ్లిపోతున్నారు, తీరిగ్గా వెకేషన్‌కి వచ్చినోళ్లు మిగిలిపోయారు’ అంటూ ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు ‘ప్రేక్షకుల ఓట్లకు బిగ్ బాస్ తెలుగులో విలువ లేదు’ అని రాసుకొచ్చారు. కొందరైతే ‘ఫైట్ చేసిన అమ్మాయిని బయటికి పంపించావ్ కదా... మీకు నచ్చిన వ్యక్తుల్లో ఒకరికి ట్రోఫీ, మరొకరికి కారు, ఇంకొకరికి సూట్ కేసు ఇచ్చేసుకో’ అని వీడియోలు పెట్టారు.
వేల ట్వీట్లు
ఇనయా ఎలిమినేట్ అయ్యాక కాదు, ఆమె ఎలిమినేట్ అవ్వబోతోందని లీక్ అయిన వెంటనే ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలైంది. దాదాపు లక్షకు పైగా ‘ఇనయా అన్ ఫెయిర్ ఎలిమినేషన్’ ట్వీట్లు వచ్చాయి. అంతేకాదు ఆమె ఎలిమినేట్ అయినట్టు కన్ఫామ్ అయ్యాక అర్థారాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఎంతో మంది అభిమానులు వెళ్లారు. ఎలిమినేట్ అయిన వారిని అర్థరాత్రే ఇంటి నుంచి వాళ్ల ఇంటికి చేరుస్తారు బిగ్ బాస్ టీమ్. అందుకే శనివారం అర్థరాత్రికి అక్కడికి ఆమె అభిమానులు చాలా మంది వచ్చారు.
ఇనయా బిగ్ బాస్ ట్రోఫీని గెలవలేదు. కనీసం ఫైనల్‌కి కూడా చేరలేదు. కానీ తన ఫైటింగ్ స్పిరిట్‌తో ప్రేక్షకుల మనసులను మాత్రం గెలుచుకుంది.
Also read: అనుకున్నట్టే ఇనయా సుల్తానా అవుట్ - మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున