బిగ్‌బాస్ హౌస్ ఒక ప్రెషర్ కుక్కర్‌లాంటిది. ఆ ఒత్తిడిని తట్టుకుంటూనే ఆటాడాలి, కోపం వచ్చినా మాటలు తూలకూడదు. అతిగా మాట్లాడి, అతిగా అరిచి, అతిగా ఓవరాక్షన్ చేసిన వారెవ్వరూ బిగ్ బాస్ విన్నర్ అయినట్టు చరిత్రలో లేదు. ప్రేక్షకులు ఆట ఆడినోళ్లనే గెలిపిస్తారు అనుకుంటున్నారు ఈ సీజన్ ఇంటి సభ్యులు, కానీ ఆటకన్నా కూడా ఇంట్లో వారి ప్రవర్తన, మాటతీరు, కోపాన్ని తట్టుకోవడం, ఎదుటివారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశాలపైనే ఓట్లు పడుతున్నాయి. బాగా ఆడినా కూడా... అందరినీ తిడుతూ, నోరు పారేసుకునే ఆటగాడిని ఇంట్లో ఉంచేందుకు ఇష్టపడరు ప్రేక్షకులు. ప్రతి సీజన్ చూస్తే  ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఈ సీజన్ ఇంటి సభ్యులకు మాత్రం ఆ విషయం అర్థం కావట్లేదు. ముఖ్యంగా రివ్యూలు చెప్పి చెప్పి పండిపోయిన గీతూ కూడా ఆ విషయాన్ని పసిగట్టలేక బయటికి వెళ్లిపోయింది.


మంచి ప్లేయర్ కానీ...
గీతూ మంచి ప్లేయర్... ఆ విషయంలో తప్పుబట్టే అవకాశమే లేదు. కానీ ఆమె ఆట ఆడే పద్దతి, ఆ ఆటలో ఆమె ప్రవర్తించిన తీరు, విసిరిన మాటలు ఇవన్నీఆమె పట్ల చాలా నెగిటివిటీని పెంచాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే కేవలం తనలోని గేమర్‌ని చూపిస్తే సరిపోదు, తనలోని మనిషిని కూడా చూపించాలి. ప్రేమ, ఉద్వేగం, కోపం, కరుణ, ఇతరుల పట్ల కాస్త బాధ్యత... ఇలా అన్నీ కలగలిసిన వాడే సంపూర్ణ మనిషి అవుతాడు. ఇందులో గీతూ ఎన్ని చూపించింది? గేమ్ గేమ్ అంటూ పూర్తి గేమర్‌గా మారిపోయింది. కోపం, చిరాకు, ఎదుటివారికి ఏమాత్ర విలువివ్వకుండా తీసిపడేయడం ఇవే గీతూపై నెగిటివిటీని పెంచాయి. తనలోని నిజమైన మనషిని చూపించలేకపోయింది. దీని వల్ల ఆమె ఏ ఎమోషన్స్ లేని బండరాయిలా కనిపించింది ప్రేక్షకులకు. ఇంట్లో ఎవరైనా బండరాయిని ఉంచుకుంటామా? అదే విధంగా బిగ్ బాస్ ఇంట్లోంచి కూడా పంపించేశారు ప్రేక్షకులు.


గీతూ వెళ్లాక అయినా శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, రేవంత్  వంటి వారికి అర్థమై ఉండాలి పరిస్థితి. మంచి గేమర్ బయటికి వెళ్లిపోయింది? ఎందుకు వెళ్లిపోయింది అని ఆలోచిస్తే ... ఆమె ప్రవర్తన వల్లే అని వారికి అర్థమవుతుంది. కానీ వారు అలా ఆలోచించకుండా యథావిధిగా ప్రవర్తిస్తున్నారు. ఇనాయను కార్నర్ చేయడం, ఆమెను చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఆమె మాట్లాడినప్పుడల్లా వెకిలినవ్వులు, వెకిలి చేష్టలు చేయడం... వంటివి వారిపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక ఫైమా అయితే ఒక్క ఇనాయనే టార్గెట్ చేసింది అని క్లియర్‌గా తెలిసిపోతుంది. ఫైమాను అంతగా ఇనాయ ఏం బాధపెట్టిందో మాత్రం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఫైమా వెకిలి చేష్టలు చూస్తుంటే ఈసారి బ్యాగు సర్దుకోవాల్సిందేనేమో అనిపిస్తుంది.


ఆడకపోయినా...
ఇంట్లో వాసంతి, మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి... సాధారణంగా ఆడతారు. మిగతా వాళ్లలా బట్టలు చించేసుకుని ఆడరు. అయినా వారికి ఓట్లు పడుతున్నాయి. కారణం మంచి ప్రవర్తన. నామినేషన్లలో కూడా వారు ఎవరిని  తక్కువ చేసి మాట్లాడడం, ఒకరిని అంటుంటే వెకిలిగా నవ్వడం, చిత్ర విచిత్ర ముఖకవళికలు పెట్టడం ఇవన్నీ చేయరు. అందుకే ఆడినవాళ్లు వెళ్లిపోయినా కేవలం చక్కటి ప్రవర్తన ద్వారా వీరు ఇంట్లో ఉన్నారు. అలాగే ఆటలో కూడా తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. 


శ్రీహాన్, రేవంత్ తమ నోటిని అదుపులో పెట్టుకుంటే వీరిద్దరిలో ఒకరు విన్నర్, రన్నర్ అయ్యే అవకాశం ఉండేది. కానీ స్వయానా తామే ఆ అవకాశాలను వదులుకుంటున్నారు. ఇంట్లో ఏ కంటెస్టెంట్‌నైనా కార్నర్ చేసి ఆడుకుంటే బయట ప్రేక్షకులు చూస్తూ ఊరుకుంటారా? అందుకే వీరంతా ఇంట్లో ఇనాయను తొక్కుతుంటే, బయట ప్రేక్షకులు ఆమెకు ఓట్లేసి టాప్ ప్లేసులోకి తీసుకెళ్తున్నారు.   


Also read: ఇచ్చిందే ఫిజికల్ టాస్కు, ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?