Geetu Royal Comments On Bigg Boss Host Nagarjuna: ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏడు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ముగిసిన 7వ సీజన్ గురించి ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అన్ని సీజన్స్‌లో 7వ సీజన్‌కే ఎక్కువ పాపులారిటీ లభించిందని మేకర్స్ అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఎప్పటికప్పుడు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేయడం కోసం బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా గీతూ వ్యవహరించింది. హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను, వారు మాట్లాడిన మాటలను వారికే గుర్తుచేసి మరీ ప్రశ్నలతో చెమటలు పట్టించేది. ఇక బిగ్ బాస్ బజ్ పూర్తయిపోవడంతో గీతూ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


అంతా స్క్రిప్ట్..
గీతూ పాల్గొన్న ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. ముందుగా హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నాగార్జునకు హోస్ట్‌గా ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ వస్తుందేమో అని సందేహం వ్యక్తం చేసింది. ‘‘నాగార్జున సీజన్ 4 లేదా 5లోనో హోస్ట్‌గా ఫెయిల్ అయ్యారనేది నా అభిప్రాయం. అప్పటివరకు ఆయనకు స్క్రిప్ట్ వస్తుందనే విషయం నాకు తెలీదు. నేను ఉన్న సీజన్‌లో అదే జరిగింది. నాకు, చంటికి జరిగిన గొడవలో నా తప్పు ఏం లేదు. కానీ నాగార్జున మాత్రం నాదే తప్పు అన్నట్టుగా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అదంతా స్క్రిప్ట్ అయ్యి ఉండచ్చు.. నాకు తెలీదు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గీతూ. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ చేసేది స్క్రిప్ట్ అని ప్రేక్షకుల్లో అనుమానం ఉన్నా.. నాగార్జున కూడా స్క్రిప్ట్‌ను ఫాలో అయ్యి జడ్జ్‌మెంట్స్ ఇస్తారని ఇప్పటివరకు చాలామందికి తెలియదు. గీతూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.


కూల్‌గా మాట్లాడేవారు..
షోకు హోస్ట్ కాబట్టి రోజూ షోను ఫాలో అయ్యి ఏది తప్పు, ఏది ఒప్పు అని సొంతంగా డిసైడ్ అయ్యి, స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని చెప్తే బాగుండేదని గీతూ.. తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. తన విషయంలోనే కాకుండా ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ విషయంలో కూడా అలాగే జరిగిందని చంటితో జరిగిన గొడవ గురించి గుర్తుచేసింది. ‘‘కంటెస్టెంట్స్ తప్పు చేస్తే అడుగుతారు, కడుగుతారు, బెండుతీస్తారు అనుకుంటే ఆయన వచ్చి హాయ్, హలో అని కూల్‌గా మాట్లాడేవారు. ఎవరు తప్పు చేసినా ఖండించేవారు కాదు’’ అని తెలిపింది గీతూ. నాగార్జున ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా స్క్రిప్ట్‌లో ఉంటుందనుకుంటా అని చెప్పింది. ఇక చివరిగా ఒక హోస్ట్‌గా అన్ని పాయింట్లను కవర్ చేయడం కష్టం అంటూ నాగార్జునకే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఆయన ఈ సీజన్‌లో కరెక్టుగా ఉన్నారని తెలిపింది.


ఆడియన్స్ పంపిన ప్రశ్నలే..
షోలో హోస్ట్‌గా నాగార్జున అడగలేని చాలా విషయాలను బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా తాను అడుగుతున్నానని చెప్పుకొచ్చింది గీతూ. బజ్‌లో కంటెస్టెంట్స్‌ను ఫలానా ప్రశ్నలు అడగమని ప్రేక్షకులు తనకు పంపేవారని, దాన్ని బట్టే తను ప్రశ్నలు అడిగేదని రివీల్ చేసింది. తనకు ముందు నుంచి హోస్టింగ్ చేయడం ఇష్టమని, ఒక్కసారి అవకాశం వస్తే చాలు అనుకునేదాన్ని అని సంతోషం వ్యక్తం చేసింది. గీతూ.. హోస్ట్‌గా నాగార్జునపై చేస్తున్న కామెంట్స్ వైరల్ అవ్వగా.. తనకు చాలామంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. హోస్ట్‌గా ప్రేక్షకులు ఆయన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నారో.. అది ఆయన చేయలేకపోతున్నారని అంటున్నారు.


Also Read: ఆకాశంలో అరియానా - విమానం నుంచి దూకేసి స్కై డైవింగ్, వీడియో వైరల్