Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలేను చాలా ఘనంగా నిర్వహించారు మేకర్స్. కానీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్‌పై జరిగిన దాడికి మేకర్స్.. ఎలాంటి బాధ్యతను తీసుకోలేదు. అందుకే ఈ విషయంలో కంటెస్టెంట్సే ముందుకు వచ్చి.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా.. ఈ దాడిని ఖండిస్తున్నారు కూడా. కేవలం బిగ్ బాస్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. సీపీఐ నారాయణ కూడా బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్‌పై ఫైర్ అవ్వడంతో పాటు పల్లవి ప్రశాంత్ పరారీ గురించి కూడా వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
వారిపై కేసు పెట్టాలి..
‘‘బిగ్ బాస్‌లో పాల్గొన్నవాడిపై కాదు.. పోలీస్ ప్రతాపం చూపించాల్సింది. బిగ్ బాస్ నిర్వహకులు ఎవరు? బిగ్ బాస్ యాంకర్ ఎవరు? వాళ్లు కదా రెచ్చగొట్టింది. బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్‌పైనా, యాంకర్ అయిన నాగార్జునపైన కదా కేసు పెట్టాల్సింది. అలా కాకుండా బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక రైతుబిడ్డను హింసించడం, కేసు పెట్టడం చేసేసరికి చివరికి వాడు పరారై వెళ్లిపోయాడు. అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు. వాడు ఇంకా భయపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? తక్షణం అతడి ఎలాంటి కేసు లేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్‌గా ప్రకటించాలి. ఆ తర్వాత బిగ్ బాస్ నిర్వహకులపైన, నాగార్జునపైన కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని సీపీఐ నారాయణ అన్నారు.
మేము హామీ ఇస్తున్నాం..
‘‘పల్లవి ప్రశాంత్‌కు పొరపాటున ఏమైనా జరిగినా.. పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. సీపీఐ ఆఫీస్‌కు వచ్చేయండి, మీకేం భయం లేదు అని ఆ అబ్బాయికి కూడా అప్పీల్ చేస్తున్నాను. మేము చూసుకుంటాం. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారు మేము హామీ ఉంటాం అని రైతుబిడ్డకు మాటిస్తున్నాను’’ అని చెప్తూ సీపీఐ నారాయణ వీడియో విడుదల చేశారు. ఫైనల్స్ తర్వాత తన ఫ్యాన్స్ అని చెప్పి కొందరు ఆకతాయిలు.. ఇతర కంటెస్టెంట్స్ కార్లపై, ఆర్టీసీ బస్సులపై దాడిచేశారు. దీంతో పోలీసులు స్వచ్ఛందంగా పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేయడంతో.. ఏం చేయాలో తెలియక పరారీ అయ్యాడు.
స్పందించిన కంటెస్టెంట్స్..
ఫ్యాన్స్ తీరును చాలామంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఖండించారు. అమర్‌దీప్ సైతం తన కారుపై జరిగిన దాడి గురించి ఒక వీడియోను విడుదల చేశారు. అందులో దాడి జరిగిన సమయంలో కారులో తన కుటుంబం కూడా ఉందని వాపోయాడు. తనను ఏమైనా చేసుకోమని, కుటుంబ సభ్యుల జోలికి రావద్దని రిక్వెస్ట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయిన రోల్ రైడా, సోహైల్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. తనకు అలా జరిగితే మాత్రం బద్దలు పగులుతాయంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు సోహైల్. మరికొందరు కంటెస్టెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ దాడిపై ఇంకా స్పందిస్తూనే ఉన్నారు.
Also Read: అదంతా స్ట్రాటజీ, నాగార్జునపై కేసు నమోదు చేయాలి - సీపీఐ నారాయణ ఆగ్రహం