బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్ (Bigg Boss 8 Telugu)కు వచ్చేసింది. ట్రోఫీని సగర్వంగా ఎత్తుకునే విజేత ఎవరో ఈ వారం తెలిసిపోతుంది. గౌతమ్, నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్ 5కు చేరుకున్నారు. వీరిలో నిఖిల్ మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒకదాంట్లో ఉంటాడని సోషల్ మీడియా ఫిక్స్ అయిపోయింది. జెంటిల్మెన్ అని, సూపర్ ప్లేయర్ అని నిఖిల్ సపోర్టర్స్ అంటుంటే... మాస్క్ వేసుకుని ఆడతాడని, గ్రూప్ గేమ్ ఆడాడని మరికొందరు అంటారు. అయితే ఓవరాల్‌గా నిఖిల్ గేమ్ ఎలా ఉంది? అతని ఆటలోని ప్లస్ పాయింట్లు ఏంటి? మైనస్‌లు ఏంటి?అనేది ఇప్పుడు చూద్దాం..!
నిఖిల్ ఆటలో ప్లస్ పాయింట్లు ఏంటి?
టీవీ సీరియల్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ అంచనాలకు తగ్గకుండానే ఆడుతూ వచ్చాడు. టాస్కుల్లో విపరీతమైన పట్టుదలతో ఆడే నిఖిల్ హౌస్ లో మాత్రం జెంటిల్మెన్ గానే ఉంటూ వచ్చాడు. మొదట్లో వరుసగా మూడుసార్లు చీఫ్ కావడం హౌస్ ని సక్రమంగా ఉంచడం నిఖిల్ కు ప్లస్ అయింది. ఒకటి రెండు సార్లు మినహా ఎంతటి వివాదంలోనూ నిఖిల్ సహనం కోల్పోయింది లేదు. తనకంటూ ఓన్ గా పెరిగిన ఓట్ బ్యాంకు తోపాటు తన స్నేహితులైన పృద్వి, యశ్మీ, విష్ణు ప్రియ ల ఓట్ బ్యాంకు కూడా ఎంతో కొంత ఈ వారం నిఖిల్ కు మళ్ళే అవకాశం ఉంది. గౌతమ్ తో తనకున్న డిఫరెన్సెస్ కూడా ఈవారం సర్దుబాటు చేసుకున్నాడు నిఖిల్. మధ్యలో పాత హౌస్ మేట్స్ వచ్చి యశ్మీ ని ఎమోషనల్ గా వాడుకునే ప్రయత్నం చేశాడంటూ చేసిన నామినేషన్స్ నిఖిల్ కే కొంత సింపతి తెచ్చిపెట్టాయి. ఇవన్నీ బిగ్ బాస్ లాస్ట్ వీక్ లో నిఖిల్ గేమ్ కు ప్లస్ గా మారనున్నాయి.
మరి నిఖిల్ ఆటలో మైనస్‌లు ఏంటి?
నిఖిల్ లోని అతిపెద్ద మైనస్ ఏమిటంటే... ఏదీ తెగించి బయట పెట్టకపోవడం. పృథ్వీ లాంటి ఫ్రెండ్ కోసం కూడా తను సరైన సమయంలో ఓపెన్ అయ్యేవారు కాదు. ఇక గౌతమ్ కృష్ణతో మొదలుపెట్టిన రైవల్రీ అతని ప్రత్యర్థికి ప్లస్ అయింది. స్ట్రాంగ్ ప్లేయర్స్ ను ఐడెంటిఫై చేసి వాళ్లతో పోటీ పడే బదులు వాళ్ళని దగ్గర చేసేసుకుంటాడు అనే విమర్శ నిఖిల్ మీద ఉంది. సోనియా, పృథ్వి, నబీల్ ఆఫ్రిదిలతో ఇదే గేమ్ ప్లాన్ అమలు చేశాడనేది యాంటీ నిఖిల్ ఫ్యాన్స్ చెప్పేది. ఇక హౌస్లో గ్రూప్ గేమ్ మొదలు పెట్టింది నిఖిలే అని వారు అంటారు.
ఓవరాల్ గా కొన్ని విమర్శలు ఉన్నా టాస్కుల్లో మొదటి నుంచి కష్టపడి ఆడుతుండటం, మొదటి నుండీ ఉన్న ఫ్యాన్ బేస్, ఎక్కువసార్లు నామినేషన్ కి వచ్చి వెళ్లడం, వీలైనంతవరకు మాట జారకుండా ఉండడం ఇవన్నీ కలిపి నిఖిల్ ని టాప్ 5కి తీసుకెళ్ళిపోయాయి. ఈ సీజన్లో టాప్ 1 లేదా 2 స్థానాల్లో నిఖిల్ ఉండడం గ్యారంటీ అని నిఖిల్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
Also Read: అవినాష్‌కు బిగ్‌బాస్ టైటిల్ గెలిచే సత్తా ఉందా? అతనిలో ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?