తెలుగు ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కోసం త్వరలోనే 7వ సీజన్ ప్రారంభం కానుంది. గత నాలుగు సీజన్లలాగానే ఈసారి కూడా నాగార్జుననే ‘బిగ్ బాస్’‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాకపోతే మునుపటి సీజన్ల కంటే 7వ సీజన్ చాలా భిన్నంగా ఉంటుందని నాగార్జున ముందు నుంచే హింట్ ఇస్తున్నారు. మునుపటి సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్స్ చాలామంది అంతకు ముందు సీజన్లను చూసి.. టాస్కులు ఎలా ఆడాలి, ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలి.. లాంటి స్ట్రాటజీలను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. ఈసారి అలా కుదరదు అని నాగ్ కచ్చితంగా చెప్పేశారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో కాస్త డిఫరెంట్‌గా ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కోసం కూడా ఒక బంపర్ ఆఫర్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.


అప్పట్లో లైవ్ స్ట్రీమింగ్..
‘బిగ్ బాస్’ ప్రోగ్రామ్ అనేది 24 గంటలు హౌజ్‌లో జరిగే విషయాలను ప్రేక్షకులకు చూపించలేదు. అలా చూపించడం కూడా చాలా కష్టమే. అందుకే కేవలం అందులోని ఆసక్తికర అంశాలను తీసి ఒక గంట ఎపిసోడ్‌లాగా ప్లాన్ చేశారు. కానీ ‘బిగ్ బాస్’ 6 మాత్రం కాస్త భిన్నంగా నడిచింది. ‘బిగ్ బాస్’ హౌజ్ నుండి 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రేక్షకులకు అందించారు మేకర్స్. హాట్‌స్టార్ ఓపెన్ చేసి ‘బిగ్ బాస్’ 6 అని సెర్చ్ చేస్తే చాలు.. లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ కనిపించేది. ఈసారి అలా ఉంటుందో లేదో తెలియదు కానీ.. ‘బిగ్ బాస్’ బజ్ మాత్రం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ‘బిగ్ బాస్’ బజ్ చూసి, ఫాలో అయ్యేవారికి మాత్రం ఒక బంపర్ ఆఫర్.


‘బిగ్ బాస్’ బజ్ అంటే..
‘బిగ్ బాస్’ అనేది కేవలం ఒక గంట ఎపిసోడ్‌గా టీవీలో ప్రసారం అవుతుంది. కానీ ఆ గంట ఎపిసోడ్‌లో చూపించని కొన్ని విషయాలను ‘బిగ్ బాస్’ బజ్ పేరుతో స్టార్ మా మ్యూజిక్‌లో విడుదల చేస్తారు మేకర్స్. ‘బిగ్ బాస్’ బజ్ కూడా సాధారణ ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ లాగానే ఉంటుంది కానీ అందులో మరికాస్త ఎక్కువసేపు హౌజ్‌మేట్స్ చేసిన ఆసక్తికర పనులను చూపిస్తారు. చాలామంది ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్.. ఈ ‘బిగ్ బాస్’ బజ్‌కు కూడా అడిక్ట్ అయ్యారు. అయితే ఈ ‘బిగ్ బాస్’ బజ్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారి కోసం ‘బిగ్ బాస్’ టీమ్ ఒక బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ‘బిగ్ బాస్’ ఆటను లైవ్‌గా సెట్‌లో చూపిస్తానంటోంది. అది ఎలాగో కూడా తాజాగా రివీల్ చేసింది.


ఈసారి ఆట మీ హౌజ్‌లో కూడా..
‘ఈసారి ఆట ఆ హౌజ్‌లో మాత్రమే కాదు.. మీ హౌజ్‌లో కూడా.  ‘బిగ్ బాస్’ వీకెండ్ ఎపిసోడ్ లైవ్‌లో సెట్ నుండి చూడాలని అనుకుంటున్నారా? అయితే ప్రతీ రోజు ‘బిగ్ బాస్’ బజ్‌లో మేము అడిగే ప్రశ్నలకు ఫేస్‌బుక్ లైవ్‌లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన లక్కీ విన్నర్ వీకెండ్ ఎపిసోడ్‌ను లైవ్ ఆడియన్స్‌గా చూడవచ్చు.’ అంటూ ‘బిగ్ బాస్’ టీమ్.. ఒక వీడియోను విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 3న ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్‌గా అవుతుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 4 నుండి ‘బిగ్ బాస్’ బజ్ ప్రారంభం కానుంది. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్‌లో ‘బిగ్ బాస్’ బజ్ ప్రసారం కానుందని ఈ వీడియో ద్వారా ప్రకటించారు. అయితే గత కొన్ని ‘బిగ్ బాస్’ సీజన్స్ నుండి వీకెండ్ ఎపిసోడ్స్‌లో వచ్చిన ఆడియన్స్‌ను కూడా ఆటలో చేర్చి.. వారితో ఏదో ఒక యాక్టివిటీని చేయిస్తున్నాడు నాగార్జున. దీంతో లైవ్ ఆడియన్స్‌లాగా వెళ్తే ఆ మజానే వేరు అని ఇప్పటికే ఈ బంపర్ ఆఫర్‌పై అంచనాలు పెంచేసుకుంటున్నారు ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్.



Also Read: జీవితాన్నిఆసక్తికరంగా మార్చేది అదే: సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial