బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే చాలామంది హైలైట్ అవ్వాలి, ఇండస్ట్రీలో అవకాశాలు సాధించాలి అన్న ఆలోచనలతోనే వస్తారు. కానీ అందులో అందరు కంటెస్టెంట్స్ ప్రేక్షకుల దృష్టిలో పడలేరు. కొందరు యావరేజ్‌గా మిగిలిపోతారు. విన్నర్ అయినా కూడా కొందరు కంటెస్టెంట్స్ ఎక్కువకాలం వరకు ప్రేక్షకులకు గుర్తుండరు. కానీ ట్రాఫీ గెలవకపోయినా.. ప్రేక్షకుల అటెన్షన్ గెలుచుకున్నవారు ఉన్నారు. అలా ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ 6 సీజన్లలో కనీసం ఒక్కరైనా అలాంటి కంటెస్టెంట్ ఉన్నారు.


హరితేజ


అప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది హరితేజ. కొన్ని సినిమాల్లో పాత్రల వల్ల తనకు బాగా గుర్తింపు కూడా లభించింది. కానీ బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత తనలోని అన్ని టాలెంట్స్ బయటపడ్డాయి. హరితేజ చెప్పిన హరికథ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అందుకే ఫైనల్స్ వరకు వెళ్లింది. బిగ్ బాస్ సీజన్ 1 ట్రోఫీని శివబాలాజీ అందుకున్నా కూడా హరితేజనే విన్నర్ అయితే బాగుండేది అని చాలామంది అనుకున్నారు. హరితేజ టైమింగ్ మూవీ మేకర్స్‌ను కూడా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌజ్‌లో తనలోని కామెడీ యాంగిల్ అంతా బయటికి రావడంతో మేకర్స్ కూడా తనను కామెడీ రోల్స్‌కు ఎంపిక చేశారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హరితేజ ఎన్నో సినిమా ఆఫర్లను అందుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కామెడీని పండిస్తూ హరితేజ ఫుల్ బిజీగా ఉంది.


రోల్ రైడా


బిగ్ బాస్ సీజన్ 2లో విన్నర్ ఎవరు అనే విషయంపై బయట పెద్ద చర్చే జరిగింది. సీజన్ మొదలైన కొన్నిరోజుల నుండే కౌశల్ విన్నర్ అంటూ బయట ప్రేక్షకులు తనకు ఫుల్‌గా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా కౌశల్ ఆర్మీ అంటూ ఫ్యాన్ పేజ్‌లను కూడా క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఫ్యాన్ బేస్‌తో విన్నర్ అయ్యి ట్రోఫీ అందుకున్న తర్వాత అసలు కౌశల్ ఏమయిపోయాడో కూడా తెలియదు. కానీ అదే సీజన్‌లో తనతో పాటు పాల్గొన్న ర్యాపర్ రోల్ రైడాకు మాత్రం ఆ తర్వాత భారీ ఆఫర్లే వచ్చాయి. బిగ్ బాస్‌కు రాకముందు ర్యాపర్‌గా పలు ప్రైవేట్ ఆల్భమ్స్ చేశాడు రోల్ రైడా. కానీ బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలకు ర్యాప్ పాడే అవకాశాలను అందుకున్నాడు. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ రోల్ రైడాకు లైఫ్ టర్న్ అయిపోయే అవకాశాలు వచ్చాయి. 


రాహుల్ సిప్లిగంజ్


బిగ్ బాస్ అంటే తమ బలాన్ని ఉపయోగించి టాస్కులు ఆడి, ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే విన్నర్స్ అవుతారు అనే ఆలోచనను రాహుల్ సిప్లిగంజ్ పూర్తిగా మార్చేశాడు. ఎక్కువగా తన పాటలతో, మాటలతోనే రాహుల్.. ప్రేక్షకులను అలరించాడు. తను కాకుండా ఇంకా ఇతర యాక్టివ్ కంటెస్టెంట్స్ ఉన్నా ప్రేక్షకులు మాత్రం రాహుల్‌నే విన్నర్ చేశారు. బిగ్ బాస్ అనేది రాహుల్ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారిపోయింది. సినిమాల్లో మాస్ పాటలు పాడాలంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్లు రాహుల్‌నే అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. అలా తను పాడిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుంది. తనను ఏకంగా ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేలా చేసింది. 


సయ్యద్ సోహెల్


ఒక్కొక్కసారి బిగ్ బాస్‌ ట్రాఫీ గెలుచుకున్న తర్వాత కూడా కొందరు దానిని లెక్కచేయకుండా వారి గత జీవితాన్నే గడపడానికి ఇష్టపడుతుంటారు. అలా బిగ్ బాస్ సీజన్ 4లో విన్ అయిన అభిజిత్ కూడా అదే చేశాడు. మళ్లీ విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోయాడు. కానీ తనతో బిగ్ బాస్ హౌజ్‌లో ఎన్నో గొడవలు పెట్టుకున్న సోహెల్ మాత్రం హీరోగా సెటిల్ అయిపోయాడు. హౌజ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే దాదాపు హీరోగా అరడజను సినిమాలను లైన్‌లో పెట్టాడు సోహెల్. అందులో రెండు విడుదల చేశాడు కూడా. కథ వేరే ఉంటది అంటూ బిగ్ బాస్ హౌజ్‌లో సోహెల్ చెప్పిన మాట.. తన కథనే పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం హీరోగా తన తరువాతి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు సోహెల్.


సన్నీ


బిగ్ బాస్ సీజన్ 5కు విన్నర్‌గా నిలిచాడు సన్నీ. హౌజ్‌లో ఎక్కువగా గొడవపడాలన్నా, కరెక్ట్‌గా ఆలోచించాలన్నా, పాయింట్ మాట్లాడాలన్నా సన్నీ ముందుండేవాడు. అన్ని అంశాల్లో సన్నీ బెస్ట్ అని చాలాసార్లు అనిపించేలా చేశాడు. అందుకే తన యాటిట్యూడ్‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. అప్పటివరకు జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీకి హీరోగా అవకాశాలు తెచ్చిపెట్టింది బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 5లో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తమ మునుపటి జీవితాల్లో బిజీ అయితే.. సన్నీ మాత్రం హీరోగా సెటిల్ అయిపోయాడు.


శ్రీ సత్య


బిగ్ బాస్ సీజన్ 6లో ఎక్స్‌ట్రా గ్లామర్‌ను యాడ్ చేసింది శ్రీసత్య. తన వెంటపడుతున్న అర్జున్ కళ్యాణ్‌ను ఆటపట్టించడం, అందరితో సరదాగా ఉండడం.. ఇలా శ్రీ సత్య గురించి ఎన్నో పాజిటివ్ విషయాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక శ్రీ సత్య డ్యాన్స్ కోసం ఎదురుచూస్తూ చాలామంది తనకు ఫ్యాన్స్ అయిపోయారు కూడా. అందుకే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకు ఎక్కువగా డ్యాన్స్ షోల నుంచి కంటెస్టెంట్‌గా ఆఫర్లు వచ్చాయి. అలా బుల్లితెరపై కూడా తన డ్యాన్స్‌తో, గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తోంది శ్రీ సత్య.


Also Read: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’ హౌస్‌కు, ఇంతలోనే విషాదం - ఆమె షో నుంచి తప్పుకున్నట్లేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial