Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ గురించి, ప్రైజ్ మనీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కామన్ మ్యాన్‌గా వచ్చి సీరియస్, సినీ సెలబ్రిటీలు అందరితో పోటీపడి బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నిసార్లు నామినేషన్స్‌లో ఉన్నా కూడా ఓటింగ్ విషయంలో ఎప్పుడూ టాప్ 3లోనే ఉండేవాడు ప్రశాంత్. ఇక హౌజ్‌లో తన పర్ఫార్మెన్స్ చూసి తనకు ఫ్యాన్‌బేస్ కూడా పెరిగిపోయింది. ఇప్పటివరకు సీజన్ 7లోని అందరి కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ప్రసారాలు సాగినా.. ప్రశాంత్ రెమ్యునరేషన్ గురించి మాత్రం మొట్టమొదటిసారిగా బయటికొచ్చింది.


బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయిన అందరు కంటెస్టెంట్స్‌లో పల్లవి ప్రశాంత్‌కే అతి తక్కువ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. తను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా కూడా ఎంత రెమ్యునరేషన్ అయినా పర్వాలేదు అన్నట్టుగా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్. తన రెమ్యునరేషన్ వారానికి కేవలం రూ.1 లక్ష అని సమాచారం. అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌజ్‌లో 15 వారాలు ఉన్నాడు కాబట్టి.. మొత్తంగా తనకు రూ.15 లక్షల రెమ్యునరేషన్ లభించనుంది. ఇక ప్రైజ్ మనీ మొత్తం రూ.50 లక్షలు కాగా.. అందులో నుంచి రూ.15 లక్షలు యావర్ తీసుకెళ్లిపోయాడు. దీంతో విన్నర్ అయినా కూడా ప్రశాంత్‌కు రూ.35 లక్షలు మాత్రమే ప్రైజ్ మనీగా లభించింది. దాంతో పాటు ఇతర బహుమతులు కూడా లభించాయి. 


ప్రైజ్ మనీతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీని కూడా దక్కించుకున్నాడు పల్లవి ప్రశాంత్. దాంతో పాటు కారు, డైమండ్ నెక్లెస్‌ను కూడా బహుమతిగా పొందాడు. ముందుగా పల్లవి ప్రశాంత్‌తో పాటు తన తల్లిదండ్రులకు రూ.35 లక్షల చెక్‌ను అందజేశారు. ఆ తర్వాత మారుతీ బ్రెజాను బహుమతిగా ఇచ్చారు. జోస్ అలుక్కాస్ తరపున రూ.15 లక్షలు విలువజేసే నగలు కొనుక్కోవడానికి చెక్‌ను గిఫ్ట్‌గా అందుకున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే రన్నరప్‌గా నిలిచిన అమర్ దీప్‌కు మాత్రం ఏమీ లభించలేదు.


బిగ్ బాస్ సీజన్ 7లోకి రైతుబిడ్డగా ఎంటర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ప్రవర్తన చూసి సింపథీ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడని, సింపథీ స్టార్ అని నెగిటివిటీని దక్కించుకున్నాడు. కానీ కొద్దిరోజుల్లోనే తన గేమ్‌తో నెగిటివిటీని అంతా పాజిటివ్‌గా మార్చుకున్నాడు. ఎంతోమంది బిగ్ బాస్ ప్రేక్షకులను తన అభిమానులను చేసుకున్నాడు. ఫోకస్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 7’లో కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్రా సాధించుకున్నాడు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన పోటీలో కూడా తానే విన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్‌కు గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎటూ డైవర్ట్ అవ్వకుండా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో తెలుసు అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు. అందుకే తన పట్టుదల చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి.. తనకే ఓట్లు వేయడం మొదలుపెట్టారు. టాస్కుల్లో బలమైన గాయాలైనా సరే తగ్గేదేలే అంటూ ముందుకు సాగాడు ప్రశాంత్. మైండ్ గేమ్స్‌కు దూరంగా ఉంటూ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అలాగే టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు.