Bigg Boss 7 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7లో ఏ గ్రూప్‌లో లేకుండా వ్యక్తిగతంగా ఆడిన కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామంది ప్రేక్షకులు చెప్పే పేరు అర్జున్ అంబాటి. ఎవరు తనకు సపోర్ట్‌గా నిలబడపోయినా.. ఒక్కడుగా ఆడి ఫినాలే అస్త్రాను సంపాదించుకున్నాడు అర్జున్. ఆ ఫినాలే అస్త్రానే తను రెండు వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండేలా హౌజ్‌లో ఆపింది. ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6వ కంటెస్టెంట్‌గా హౌజ్ నుండి బయటికి వచ్చేశాడు అర్జున్. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత వారికి పాప పుట్టినా, బాబు పుట్టినా ఏ పేరు పెట్టాలి అనే విషయాన్ని నాగార్జునతో పంచుకున్నాడు. తన భర్త ఆటతీరు బాగుందని భార్య సురేఖ సంతోషపడింది.


మునుపటి సీజన్స్‌లో లేనివిధంగా బిగ్ బాస్ సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ను ఫైనల్స్‌కు పంపించారు బిగ్ బాస్. ఇక వారందరిలో నుండి ముందుగా అర్జున్ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. యాంకర్ సుమ.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి అర్జున్‌ను ఎలిమినేట్ చేసి స్టేజ్‌పైకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటినుండి సుమను ఎప్పుడు టీవీలో చూసినా.. తనకు తన ఎలిమినేషనే గుర్తొస్తుందని అర్జున్ వాపోయాడు. మనసులో ఏం పెట్టుకోవద్దని అర్జున్‌కు ధైర్యం చెప్పి వెళ్లిపోయింది సుమ. అర్జున్ స్టేజ్‌పైకి రాగానే సురేఖను కూడా స్టేజ్‌పైకి పిలిచి.. వారితో ఒక ఫోటో దిగారు నాగార్జున. మామూలుగా ఈరోజుల్లో కపుల్స్ అందరూ తెగ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారని.. కానీ వారికి మాత్రం ఎప్పుడూ అలాంటి అవకాశం రాలేదని అర్జున్ చెప్పిన మాటలను నాగార్జున గుర్తుపెట్టుకొని.. స్టేజ్‌పై వారు దిగిన ఫోటోను బహుమతిగా ఉంచుకోమని తెలిపారు. 


అర్జున్ కోసం సురేఖ స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత మీ ఆయనను ఇంటికి తీసుకెళ్లిపో అని నవ్వారు నాగార్జున. అయితే తను బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నా కూడా టీవీ చూసి సురేఖ టెన్షన్ పడుతుందేమో అని తానెప్పుడూ టెన్షన్‌లో ఉండేవాడని అర్జున్ బయటపెట్టాడు. ఇప్పుడు టెన్షన్ ఏం లేదని జాగ్రత్తగా చూసుకోమని నాగ్ సలహా ఇచ్చారు. అంతే కాకుండా అమ్మాయి పుట్టినా.. అబ్బాయి పుట్టినా.. వారికి ఆర్కా అని పేరు పెట్టాలనుకుంటున్నామని అర్జున్ బయటపెట్టాడు. ఆర్కా అంటే ఏంటి అని నాగార్జున అడగగా.. దేవుడికి పువ్వులను అర్పించేదాన్ని ఆర్కా అంటారని తెలిపాడు అర్జున్. సురేఖ పేరును, తన పేరును సగం సగం కలిపితే ఆర్కా అని వస్తుందని అన్నాడు. 


బిగ్ బాస్ హౌజ్‌లో ఎంత బాగా టాస్కులు ఆడినా కూడా బలగం లేకపోతే.. ఓట్లు పడకపోతే.. బయటికి రాక తప్పదు అని అర్జున్ ఎలిమినేషన్ ఉదాహరణగా నిలిచింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నుంచే కంటెస్టెంట్‌గా ఉండి, ఇదే ఆట కనబరిచి ఉంటే.. అర్జున్ కచ్చితంగా విన్నర్ అయ్యేవాడని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తను హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆడిన చాలావరకు టాస్కుల్లో అర్జున్ విన్నర్‌గా నిలిచాడు.. అది కూడా ఏ ఫౌల్ గేమ్ లేకుండా. అయినా కూడా విన్నర్ కాలేకపోయాడు.