Pallavi Prasanth Arrest: 'బిగ్ బాస్ తెలుగు' సీజన్-7 విన్నర్, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం ఘటనలో ప్రశాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తలరించారు. రైతుబిడ్డగా హౌస్ లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ గా బయటకు వచ్చిన ప్రశాంత్, అనుకోని విధంగా వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ అరెస్టుపై ఆయన తండ్రి సత్యనారాయణ స్పందించారు. తన కుమారుడు టైటిల్ గెలిచాడనే సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, ప్రశాంత్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉందని కన్నీటి పర్యంతమయ్యారు.
పల్లవి ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ తన కొడుకు బిగ్ బాస్ టైటిల్ గెలిచినందుకు మురిసిపోయానని, కానీ ఆ ఆనందం ఐదు గంటలు కూడా లేదని అన్నారు. "ఇదంతా మాకు ఎందుకు? ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఏవేవో సృష్టించి ట్రోల్ చేస్తున్నారు. ఒకటికి మరొకటి రాస్తున్నారు. ఇదంతా చూసి చాలా బాధేస్తోంది" అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గొడవతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, ప్రశాంత్ పక్కనే తను కూడా ఉన్నానని చెప్పారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పట్ల పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా? అని సత్యనారాయణ ప్రశ్నించారు. తన కొడుకు ఎక్కడికి పోలేదని, కానీ పరారీ అయినట్లు వార్తలు రాశారని వాపోయారు.
పోలీసుల తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం పోలీసులు తమ ఇంటికి వచ్చి ప్రశాంత్ ను తీసుకెళ్లారని తెలిపారు. చొక్కా మార్చుకొని వస్తా అని చెప్పినా కూడా వినలేదని, ఒకతను ప్రశాంత్ మెడ మీద చేతులపెట్టి లాక్కొస్తునే ఉన్నాడని చెప్పారు. కేసు వివరాలేవీ చెప్పలేదని, అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదని, దొంగతనం చేసినట్లు ప్రశాంత్ ను తీసుకెళ్లారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, ఏడుస్తూనే ఉందని, తమని లేని పోనీ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ దొంగ కాదని ప్రజలందరినీ వేడుకుంటున్నానని అన్నారు. బిగ్ బాస్ కు పోతానంటే తానే పంపించానని, కానీ టైటిల్ గెలిచిన సంతోషం లేకుండా పోయిందని ప్రశాంత్ తండ్రి వాపోయారు.
కాగా, కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా బయటకు వచ్చాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ రియాలిటీ షోలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్ రన్నరప్ గా నిలిచాడు. అయితే ప్రశాంత్ బయటికొచ్చాక జరిగిన పరిణామాలు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆదివారం రాత్రి అభిమానులు అత్యుత్సాహంతో కొన్ని కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ ను చేర్చారు. ఈ మేరకు బుధవారం ప్రశాంత్ స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. కోర్టు శుక్రవారం పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?