‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu 7)లో నామినేషన్ల పర్వం మరోసారి వాడీవేడిగా సాగింది. అయితే, ఈసారి రతిక తన విశ్వరూపం చూపించే ప్రయత్నం చేసింది. చెప్పాలంటే నటించింది. మరోవైపు అర్జున్ తన స్ట్రాటజీ మార్చేశాడు. ఆదివారం స్టేజ్ మీదకు వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చెప్పిన టాప్-5 కంటెస్టెంట్లలో శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్, యావర్, అమర్‌లను ఎక్కువ మంది అంచనా వేశారు. దీంతో అర్జున్ సోమవారం నామినేషన్లలో పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసుకున్నాడు. ‘‘నిన్ను ఎవరైనా నామినేట్ చేస్తే రివేంజ్ నామినేషన్ చేస్తావు. అలాగే శివాజీని నామినేట్ చేసినా రివేంజ్ నామినేషన్ చేస్తావ్. నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడాలి. మరొకరి కోసం ఆడకూడదు’’ అంటూ పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. దీంతో ప్రశాంత్.. అర్జున్‌తో వాదనకు దిగాడు. ఆ తర్వాత అర్జున్.. శోభా శెట్టిని నామినేట్ చేశాడు. కెప్టెన్‌గా విఫలమయ్యావని తెలిపాడు.
శివాజీ ట్రైనింగ్‌తో నామినేషన్లలో దిగిన రతిక
నామినేషన్లకు వెళ్లే ముందు రతిక.. శివాజీ నుంచి ట్రైనింగ్ తీసుకుంది. నామినేషన్ చేస్తున్నప్పుడు భయపడకుండా.. నువ్వు చెప్పాలి అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని శివాజీ చెప్పాడు. దీంతో రతిక అందుకు రెట్టింపు ఇచ్చింది. అయితే, రతికా తనను ఎవరు నామినేట్ చేస్తారో.. వారిని తిరిగి నామినేట్ చేద్దామని ప్లాన్ చేసింది. అయితే, బిగ్ బాస్.. మాత్రం రతికానే ఫస్ట్ నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో రతిక.. ముందుగా శోభా శెట్టిని నామినేట్ చేసింది. కెప్టెన్‌గా ఆమె విఫలమైందని, ఎక్కువగా లగ్జరీ రూమ్‌కే పరిమితం అయ్యిందని, ఏ పనుల్లో ముందు ఉండేది కాదని తెలిపింది. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేసింది. రతిక పాయింట్లు చెబుతూ దానికి సమాధానాలు చెప్పాలని ప్రియాంకను కోరింది. దీంతో ప్రియాంక.. ‘‘నువ్వు టీచర్‌వు.. నేను స్టూడెంట్ మరి.. నువ్వు అడిగినదానికి నేను చెప్పాలి’’ అని సమాధానం ఇచ్చింది. అయితే, రతిక నామినేషన్స్ పాయింట్ కంటే.. తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని ఫైర్ బాంబ్ అనిపించుకొనే ప్రయత్నం చేసింది. శివాజీ ఒకటి చెబితే.. అంతకు రెట్టింపు పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
రతికాను నామినేట్ చేసిన ప్రియాంక
ఆ తర్వాత ప్రియాంక.. రతికా, అశ్వినీ శ్రీలను నామినేట్ చేసింది. రతికాను నామినేట్ చేస్తూ.. నాగ్ సార్ హోస్ట్ మాత్రమే హౌస్‌మేట్ కాదు. జరిగే నామినేషన్ ప్రక్రియా లాస్ట్ వీక్ ఉన్నదాన్ని బట్టే జరుగుతుంది. రతికా వాదిస్తున్న సమయంలో ‘‘నాగ్ సార్‌తో చెప్పాల్సింది ఈ పాయింట్లు’’ అని ప్రియాంక అంది. దీంతో ‘‘నాగార్జున హోస్ట్, హౌస్ మేట్ కాదు’’ అని అరిచింది. ఆ తర్వాత ప్రియాంక అశ్వినీ శ్రీని నామినేట్ చేసింది. నామినేషన్స్ సమయంలో శోభా, ప్రియాంక నామినేట్ చేశారని, ఇద్దరూ బిగ్ బాస్‌కు మహారాణుల్లా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. ఈ రోజు ఎపిసోడ్ రతిక, శోభా, అశ్వినీ, ప్రియాంకల వాదనతోనే సాగిపోయింది. ‘‘భోలే హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో భోలే అన్నా మీతో వచ్చేస్తాను అని అన్నావు. అది నాకు నచ్చలేదు’’ అని ప్రియాంక రాంగ్ రీజన్ తీసింది. దీంతో అశ్వినీ అది తన ఎమోషన్ అని ఆ సమయంలో అన్నదాన్ని రీజన్‌గా తీసుకోవడం బాగోలేదని తెలిపింది. ‘‘నేను కప్పు కొట్టడానికి బిగ్ బాస్‌కు రాలేదు. అనుభవం కోసం వచ్చా. గేట్ తీస్తే ఇప్పుడే వెళ్లిపోతా’’ అని అశ్వినీ తెలిపింది. ప్రియాంక ఆమె ఏడుపు గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకడు నీలా అరుస్తాడు. ఇంకొకడు నాలా ఏడుస్తాడు. ఒకడు కొడతాడు. మరొకడు ఇంకేదో చేస్తాడు. ఒక్కొక్కరిదీ ఒక్కో ఎమోషన్’’ అని అంది. దీంతో వెనకాల ఉన్న గౌతమ్, అర్జున్ నవ్వారు. దీంతో అది ఎగ్జాంపుల్ మాత్రమేనని రతిక కవర్ చేసింది.