Bigg Boss Telugu 7 Update: బిగ్ బాస్ సీజన్ 7లో ఆటగాళ్లకు, పోటుగాళ్లకు మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఆరు వారాల నుండి బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి ఆటలో ఆరితేరిపోయిన వారు ముందుంటారా లేదా ఇప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి గౌతమ్ సపోర్ట్‌తో కొత్త కంటెస్టెంట్స్ ముందుంటారా అనే అంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లులో ముందుగా ఎవరు బెస్ట్ అనే టాస్క్ మొదలయినప్పుడు పోటుగాళ్లే ముందంజలో ఉన్నారు. వరుసగా రెండు టాస్కులు గెలిచారు. ఆటగాళ్లు ఒక టాస్క్ గెలిచే సమయానికి పోటుగాళ్లు మూడు టాస్కుల్లో విజేతలుగా నిలిచారు. కానీ నేడు (అక్టోబర్ 12న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో అంతా రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఆటగాళ్లు పైచేయి సాధించారు.


సరదా గేమ్‌లో సీరియస్ గొడవలు..
ముందుగా నేడు ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య ఎవరు స్మార్టెస్ట్ అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌ ఆడాలంటే సినిమాల గురించి బాగా తెలిసి ఉండాలని బిగ్ బాస్ ముందే హింట్ ఇచ్చారు. ముందుగా బిగ్ బాస్.. ఏదైనా ఒక సినిమాలోని పాట లేదా డైలాగును వినిపిస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతారు. దానికి తగిన సమాధానాలు కంటెస్టెంట్స్ ముందు ఉన్న బాక్సులో ఫోటోల రూపంలో ఉంటాయి. అయితే ఆటగాళ్ల నుండి ఒకరు, పోటుగాళ్ల నుండి ఒకరు వచ్చి బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు ముందుగా ఒకరైతే సరైన సమాధానం ఉన్న ఫోటోను వారి ముందు ఉన్న బోర్డుపై పెడతారో వారే విన్నర్స్. ఈ టాస్క్ వినడానికి సరదాగా ఉన్నా.. దీనిలో కూడా గొడవలు పడ్డారు కంటెస్టెంట్స్.


పూజా సామెతకు శోభా కన్నీళ్లు..
బిగ్ బాస్ ప్రశ్న పూర్తి చేసిన తర్వాత పోటీదారులు ఇద్దరు తాము సరైన సమాధానం అనుకున్న ఫోటోను మాత్రమే బాక్స్‌లో నుండి తీసుకోవాలి. కానీ శోభా శెట్టి.. రెండు ఫోటోలను తన చేతిలో పట్టుకొని కాసేపు గౌతమ్‌ను ఆట ఆడించింది. తన టీమ్‌మేట్స్ ఎంత చెప్పినా.. ఇంకొక ఫోటోను బాక్స్‌లో వేయలేదు. దీంతో గౌతమ్‌కు కోపం వచ్చింది. తన ఆట చండాలంగా ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. అవును నువ్వే చెప్పాలి ఇది అంటూ శోభా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది. శివాజీ, పూజా మూర్తి పోటీపడుతున్న సమయంలో కూడా అర్జున్ సమాధానం చెప్తేనే పూజా.. కరెక్ట్‌గా ఫోటో పెట్టిందని శోభా ఆరోపణలు చేసింది. అయితే అర్జున్ అలా చేయలేదని అన్నాడు. దీంతో పూజాకు, శోభాకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ‘నువ్వు మాట్లాడితే నీతులు, నేను మాట్లాడితే భూతులు’ అంటూ శోభాకు కౌంటర్ ఇస్తూ సామెత చెప్పింది పూజా. ఆట అయిపోయాక ఈ సామెతకు అర్థం తెలుసుకున్న శోభా.. కన్నీళ్లు పెట్టుకుంది.


బెలూన్స్, బాల్స్ టాస్క్..
స్మార్టెస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత ఫోకస్డ్ టాస్క్‌ను కంటెస్టెంట్స్‌కు ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్.. బెలూన్‌ను బౌన్స్ చేస్తూ తాము ఎంచుకున్న కలర్ బాల్స్‌ను బుట్టలో వేస్తుండాలి. అలా ఆటగాళ్లు రెండు కలర్స్ బాల్స్‌ను, పోటుగాళ్లు రెండు కలర్స్ బాల్స్‌ను ఎంచుకున్నారు. పోటుగాళ్ల నుండి ఎక్కువగా అర్జున్ మాత్రమే ఆడగా.. చివర్లో గౌతమ్, నయని వచ్చారు. కానీ ఆటగాళ్ల నుండి దాదాపుగా అందరికీ ఆడే అవకాశం దక్కింది. అయితే ఆటగాళ్ల ఆట పూర్తయిపోయింది అనుకునే సమయానికి ఇంకా రెండు బాల్స్ ఉన్నాయని గుర్తించారు. ఆ రెండు బాల్స్‌ను బాక్స్‌లో వేసే సమయానికి పోటుగాళ్ల ఆట పూర్తయ్యింది అనుకున్నారు. కానీ పోటుగాళ్లకు సంబంధించిన కలర్ బాల్ ఒకటి మిగిలిపోవడంతో ఆటగాళ్లే ఈ టాస్క్‌లో విన్ అయ్యారు. దీంతో ఈరోజు జరిగిన రెండు టాస్కుల్లో ఆటగాళ్లే పైచేయి సాధించారు. బిగ్ బాస్ మొదలయిన ఆరు వారాల తర్వాత టీమ్‌గా ఎలా ఆడాలో నేర్చుకున్నామంటూ శివాజీ, తేజ ఒప్పుకున్నారు.


Also Read: నా భార్యది రాజకీయ కుటుంబం, పెళ్లికి ముందే ఆ కండీషన్ పెట్టాను - ‘బిగ్ బాస్’ శివాజీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial