‘బిగ్ బాస్ సీజన్ 7’ నాలుగో వారం నామినేషన్స్ ముగిశాయి. వాదప్రతివాదాలతో ఒక కంటెస్టెంట్ చెప్పిన కారణం.. మరొక కంటెస్టెంట్ ఒప్పుకోకపోవడంతో నామినేషన్స్‌కు సంబంధించిన రెండు ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తంలో శోభా శెట్టి, సందీప్, శివాజీ జడ్జిలుగా వ్యవహరించారు. ఈసారి కంటెస్టెంట్స్‌లో ఎవరు నామినేట్ అవ్వాలి అనే విషయాన్ని సగం వరకు కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే.. దాని తుది నిర్ణయం ఈ జడ్జిల చేతిలో ఉంది. ఎంత జడ్జిలు అయినా కూడా కొన్నిసార్లు వారి నిర్ణయం కూడా తప్పు అయ్యే అవకాశం ఉంది. గౌతమ్ కృష్ణ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది.


పల్లవి ప్రశాంత్.. తనవంతుగా అమర్‌దీప్‌ను, గౌతమ్ కృష్ణను నామినేట్ చేశాడు. పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ విషయంలో అమర్ దీప్ చేసిన పనిని పాయింట్ ఔట్ చేస్తూ.. చాలామంది అతన్ని నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ కూడా అదే కారణం చెప్పి నామినేట్ చేశాడు. కాకపోతే ఈ విషయంలో తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు. ఒక అమ్మాయి అయ్యుండి ప్రియాంకకు హెయిర్ కట్ అనేది చాలా పెద్ద విషయమని, అయినా కూడా తను ఆ సాహసం చేసిందని, నువ్వు మాత్రం చేయలేదని అమర్‌దీప్‌ను పాయింట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శోభా శెట్టితో గౌతమ్ గొడవను గుర్తుచేస్తూ తనను నామినేట్ చేశాడు.


పవర్ అస్త్రా విషయంలో గౌతమ్‌కు, శోభా శెట్టికి భారీ వాగ్వాదమే జరిగింది. అదే సమయంలో గౌతమ్.. కోపంతో షర్ట్ విప్పి.. నా బాడీ నా ఇష్టం అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. ఆ విషయాన్నే పల్లవి ప్రశాంత్.. నామినేషన్‌కు కారణంగా ఉపయోగించుకున్నాడు. బాడీ చూపించడంతో పాటు షో ఆఫ్ చేస్తున్నావంటూ శోభాకు చేతితో అసభ్యంగా సైగలు చేసి చూపించాడని కూడా పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. శోభా కూడా ఏదో మ్యానరిజం చూపించావు అంటూ ప్రశాంత్ ఆరోపణతో అంగీకరించింది. అమ్మాయి ముందు షర్ట్ విప్పడం కరెక్ట్ కాదని ప్రశాంత్ వాదించాడు. అందరూ తనను రోజూ షర్ట్ లేకుండా చూస్తున్నారు కదా అని సమాధానమిచ్చాడు గౌతమ్. అది వేరు, ఇది వేరు అని సమర్థించుకున్నాడు ప్రశాంత్. పల్లవి ప్రశాంత్.. తన రెండు నామినేషన్స్ కారణాలను వినిపించిన తర్వాత.. శోభా శెట్టి కూడా చేతితో గౌతమ్ సైగలు చేసి చూపించాడని ఒప్పుకుంది. దీంతో పల్లవి ప్రశాంత్ ఆరోపణ మరింత బలంగా మారి తను నామినేట్ అయ్యాడు.


చేతి సైగలు నిజమే, కానీ..


శోభా శెట్టికి, గౌతమ్‌కు జరిగిన వాగ్వాదం సమయంలో చేతితో సైగలు చేశాడు అని పల్లవి ప్రశాంత్ ఆరోపణలు చేసినా కూడా నిజంగా గౌతమ్.. అలా చేశాడా లేదా అని చాలామందికి క్లారిటీ లేదు. కానీ ఆ గొడవ జరిగిన సమయంలో ‘‘నా ఫిజికాలిటీ గురించి నువ్వు మాట్లాడావు. నీ ఫిజికాలిటీ గురించి నేను మాట్లాడలేదు’’ అంటూ చేతితో సైగలు చేసి చూపించాడు గౌతమ్. అయితే, షో ఆఫ్ చేస్తున్నావ్ అంటూ సైగలు చేశాడని ప్రశాంత్ చెప్పిన దాంట్లో నిజం లేదు. ఈ వివాదానికి నాగార్జున తెర వేస్తారో లేదో చూడాలి. అయితే, ప్రశాంత్ ఈ పాయింట్ పట్టుకుని శోభాశెట్టికి హెల్ప్ చేయడమే కాకుండా గౌతమ్‌ను ఇరకాటంలో పడేశాడు. మరోవైపు శుభశ్రీ, ప్రిన్స్ యావర్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దీంతో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ‘‘నువ్వు నా ఫ్రెండ్ అయితే గౌతమ్‌ను వదిలేయ్’’ అని శుభశ్రీకి సలహా ఇచ్చాడు యావర్. దీనికి శుభశ్రీ సమాధానం ఇస్తూ.. ‘‘నేను తనని పట్టుకోలేదు కదా’’ అని పేర్కొంది. 


Also Read: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial