బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయిదుగురు కంటెస్టెంట్స్.. కొత్తగా హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ మధ్య పోటీపెట్టారు బిగ్ బాస్. పాత కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లుగా, కొత్త కంటెస్టెంట్స్‌ను పోటుగాళ్లుగా మార్చి.. వీరిద్దరి మధ్య ఎవరు బెస్ట్ అని పోటీని పెట్టారు. ఇప్పటికే ఎవరు బెస్ట్ అని చెప్పే ఛాలెంజ్‌లో రెండు టాస్కులు పూర్తవ్వగా.. నేడు (అక్టోబర్ 12న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు జరిగాయి. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ బ్యాచ్ అంటే పోటుగాళ్లు లీడ్‌లో ఉండగా.. వారికి పోటీ ఇవ్వడానికి ఆటగాళ్లు కూడా బాగానే ప్రయత్నాలు చేశారు.


కలర్ కలర్ విచ్ కలర్..
ఇప్పటివరకు ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య ఎవరు ఫిట్టెస్ట్, ఎవరు జీనియస్ అని రెండు పోటీలు జరిగాయి. ఈ రెండు ఆటల్లో పోటుగాళ్లే బెస్ట్ అని నిరూపించుకున్నారు. ఇక నేడు ఎవరు ఫాస్టెస్ట్, ఎవరు స్ట్రాంగెస్ట్ అని పోటీలు జరిగాయి. ముందుగా ఎవరు ఫాస్టెస్ట్ అనే పోటీలో ఆటగాళ్ల నుండి ఒకరు, పోటుగాళ్ల నుండి ఒకరు వచ్చి ‘‘కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్’’ అని బిగ్ బాస్‌ను అడగాలి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన కలర్‌ను బట్టి హౌజ్‌లోని ఏదో ఒక వస్తువును తెచ్చి గార్డెన్‌లో గీసి ఉన్న బాక్స్‌లో వేయాలి. ఈ పోటీలో అమర్‌దీప్, అశ్విని శ్రీ పెద్ద గొడవే జరిగింది.


అశ్వినితో అమర్ గొడవ..
బిగ్ బాస్.. మెరూన్ కలర్ తీసుకురమ్మని అశ్వినికి, అమర్‌కు ఆదేశానిచ్చారు. దీంతో డోర్ మ్యాట్‌ను తెచ్చి బాక్స్‌లో వేశాడు అమర్‌దీప్. అశ్విని శ్రీ మాత్రం లోపల ఉన్న ఒక బాక్స్‌ను తీసుకురావడానికి వెళ్లింది. అమర్ కూడా లోపలికి వెళ్లి అశ్వినితో కలబడి మరీ ఆమె చేతిలో ఉన్న బాక్స్‌ను లాక్కున్నాడు. దీంతో అశ్విని.. మెరూన్ కలర్ ఉన్న కోర్టును తీసుకువస్తుండగా.. మళ్లీ అమర్ అడ్డుపడ్డాడు. అయితే ఆ కోటును వేసుకోమని గౌతమ్ సలహా ఇచ్చాడు. అమ్మాయి మీద చేయి వేస్తే.. అమర్‌కే చెడ్డ పేరు వస్తుందని, అశ్వినిని ధైర్యంగా ముందుకు రమ్మన్నాడు గౌతమ్. బిగ్ బాస్ సైతం గొడవపడవద్దు అని ఆదేశాన్నిచ్చినా కూడా అమర్ వినకుండా అశ్వినిని అడ్డుకోబోయాడు. మొత్తానికి హోరాహోరీగా సాగిన ఈ ఆటలో ఆటగాళ్లు విజయం సాధించారు. ఇది వారికి దక్కిన మొదటి విజయం.


స్ట్రాటజీ ఉపయోగించిన అర్జున్..
ఆ తర్వాత ఎవరు స్ట్రాంగెస్ట్ అనే పోటీ కోసం కంటెస్టెంట్స్ సిద్ధమయ్యారు. ఆటగాళ్లు టీమ్ నుండి ప్రిన్స్ యావర్, పోటుగాళ్లు టీమ్ నుండి అర్జున్.. రెండు పెద్ద రాకెట్లను పట్టుకొని నిలబడాలి. ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో.. వారే విన్నర్. అయితే ఒక చేతిలోని రాకెట్‌ను వదిలేసినా.. మరో చేతిలో ఉన్న రాకెట్‌ను వదలనంత వరకు కంటెస్టెంట్ గేమ్‌లోనే ఉన్నట్టు అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆట మొదలయిన కాసేపటి తర్వాత అర్జున్ అంబడి.. ఎడమ చేతిలోని రాకెట్‌ను వదిలేసి కుడి చేతిలోని రాకెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత యావర్ తన కుడి చేతిలోని రాకెట్‌ను వదిలేసి ఎడమ చేతిలోని రాకెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్.. తన స్ట్రాటజీని ఉపయోగించి ఎడమ చేతిలో ఉన్న రాకెట్‌ను వదిలేశాడు. కానీ యావర్ మాత్రం ఆలోచించకుండా కుడి చేతిలోని రాకెట్‌ను వదిలేశాడు. దీంతో ఎడమ చేతితో రాకెట్‌ను ఎక్కువసేపు ఆపలేకపోయిన యావర్.. దానిని కూడా వదిలేశాడు. దీంతో పోటుగాళ్లు మళ్లీ గెలిచారు. ఇప్పటివరకు జరిగిన టాస్కులలో పోటుగాళ్లు మూడు టాస్కులు గెలవగా.. ఆటగాళ్లు మాత్రం కేవలం ఒక టాస్కునే గెలిచారు.


Also Read: ప్రశాంత్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ, భోలే షావలి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial