బిగ్ బాస్‌లో నామినేషన్స్ ముగిసి కంటెస్టెంట్స్ అంతా కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ నామినేషన్స్ ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్... ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు పవర్ అస్త్రాలు గెలుచుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా.. కొందరు ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారని గుర్తుచేశారు. అందుకే పవర్ అస్త్రాలు సాధించకుండా ఇంకా కంటెస్టెంట్స్‌గా మిగిలిపోయిన వారందరినీ నామినేట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 7లో అయిదో వారం నామినేషన్స్‌లో పవర్ అస్త్రాలు ఉన్న సందీప్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి తప్పా మిగతావారంతా లిస్ట్‌లో ఉన్నారు. ఇక నేడు (అక్టోబర్ 3న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో వారి పవర్ అస్త్రాలను వెనక్కి తీసేసుకుంటున్నట్టుగా ప్రోమోలో చూపించారు.


మళ్లీ మొదలుపెట్టిన శుభశ్రీ, గౌతమ్..
తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమో.. ముందుగా శుభశ్రీ, గౌతమ్ ప్రేమ కబుర్లతో మొదలయ్యింది. ‘‘నేను మాట్లాడితే ఇష్టం లేదా? మెంటల్‌ లాగా ఉందా?’’ గౌతమ్‌ను అడిగింది శుభ. దానికి గౌతమ్.. ముసిముసి నవ్వులు నవ్వుతూ.. ‘‘లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా’’ అని సమాధానమిచ్చాడు. ఏం లాయల్టీ అంటూ ప్రశ్నించింది శుభశ్రీ. ‘‘ఒకటే రకం ఉంటుంది లాయల్టీ అంటే’’ అని క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. దానికి శుభ ఒప్పుకోకుండా ‘‘చాలా ఉంది’’ అని చెప్పింది. ‘‘చెప్పిన మాట మీద నిలబడడమే లాయల్టీ’’ అంటూ మరోసారి స్పష్టం చేశాడు గౌతమ్. శుభశ్రీ, గౌతమ్ రొమాన్స్ అయిపోయిన తర్వాత శివాజీ.. తనకు కాఫీ లేదని తేజతో చెప్తూ వాపోయాడు.


నాదొక బ్రతుకా..
‘‘నా మనోభావాలు దెబ్బతింటున్నాయి’’ అంటూ తేజతో చెప్పడం మొదలుపెట్టాడు శివాజీ. ‘‘కాఫీ కూడా ఇవ్వలేని బ్రతుకు నాదొక బ్రతుకా అంటే ఆత్మాభినంలాగా మారుతుంది అది.’’ అంటూ కాఫీ రాకపోవడం తనకు ఎంత బాధ కలిగిస్తుందో చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ అంతా లివింగ్ రూమ్‌కు వచ్చారు. ‘‘అయిదు వారాలుగా ఇమ్యూనిటీతో పాటు వచ్చే కన్ఫర్మేషన్‌ను మీకు అందిస్తూ వచ్చిన పవర్ అస్త్రాలను బిగ్ బాస్‌కు తిరిగి ఇవ్వాలని సమయం ఆసన్నమయ్యింది’’ అంటూ హౌజ్‌మేట్స్‌కు షాకిచ్చారు బిగ్ బాస్. దీంతో సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్.. యాక్టివిటీ ఏరియాలో ఉన్న ఒక బాక్స్‌లో తమ పవర్ అస్త్రాలను కంటెస్టెంట్స్ సమక్షంలోనే పెట్టేశారు. 


శివాజీ రాక్షసానందం..
సందీప్, శోభా, ప్రశాంత్.. తమ పవర్ అస్త్రాలను తిరిగి ఇచ్చేస్తున్న సమయంలో శివాజీ.. వ్యంగ్యంగా పాట పాడడం మొదలుపెట్టాడు. చప్పట్లు కొడుతూ తను పాట పాడడం మాత్రమే కాకుండా ఇతర కంటెస్టెంట్స్‌ను కూడా పాడమని ప్రోత్సాహించాడు. శివాజీ ప్రవర్తన నచ్చని శోభా శెట్టి.. ‘‘కొందరు ఉంటారు ఎవరిదైనా పోతే చాలు.. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. అదేదో అంటారు కదా.. మనకు రాకపోయినా పర్వాలేదు. పక్కన వాళ్లకు రాకపోతే చాలు.’’ అంటూ తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. రెండోవారంలో శివాజీ కూడా పవర్ అస్త్రాను గెలుచుకున్నాడు. కానీ తను చేసిన తప్పులు, చూపించిన పక్షపాతం వల్ల ఇతర కంటెస్టెంట్స్ అంతా కలిసి తనను అనర్హుడు అని ప్రకటించారు. దీంతో తన పవర్ అస్త్రాను వెనక్కి తీసేసుకున్నారు నాగార్జున. ఇప్పటికీ శివాజీ అదే ఫ్రస్ట్రేషన్‌లోనే ఉన్నాడు.


Also Read: అవును, రజనీకాంత్ సినిమాలో రానా - ఇట్స్ అఫీషియల్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial