బిగ్ బాస్ సీజన్ 7లో డే 5 చాలా సరదాగా స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ కంటే ఎక్కువగా బిగ్ బాసే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇంతకు ముందు సీజన్స్‌లో బిగ్ బాస్ అంటే ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉంటూ, కంటెస్టెంట్స్‌తో టాస్కులు ఆడించి, వారి మధ్య గొడవలు పెట్టే ఒక వ్యక్తి మాత్రమే. కానీ ఈసారి అలా కాదు.. కంటెస్టెంట్స్.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా వారికి టాస్కులు ఇవ్వడంతో పాటు వారి మీద జోకులు కూడా వేస్తున్నాడు బిగ్ బాస్. ఇక తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ తలలపై గుడ్లు పగిలేలా చేశాడు. అది మాత్రమే కాకుండా స్విమ్మింగ్ పూల్‌లో కూడా దూకించాడు బిగ్ బాస్.


సీక్రెట్ టాస్క్..
బిగ్ బాస్ సీజన్ 7లోని లేటెస్ట్ ఎపిసోడ్‌లో ముందుగా దామిని, కిరణ్ రాథోడ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్ బాస్. ప్రస్తుతం వారి దగ్గర ఉన్న గుడ్లలో ఇద్దరూ 5, 5 గుడ్లు తీసుకొని కంటెస్టెంట్స్ తలపై కొట్టి.. వాటితో ఆమ్లెట్ చేసి బిగ్ బాస్‌కు పంపించాలని ఆదేశించాడు. అంతే కాకుండా కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వెళ్లిన తర్వాత ఈ టాస్క్ గురించి ఎవరితో చర్చించకూడదని కూడా ఆదేశించాడు. అంటే దీనిని ఇన్‌డైరెక్ట్‌గా ఒక సీక్రెట్ టాస్క్ అని చెప్పాడు. కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వచ్చిన తర్వాత అసలు ఈ టాస్క్ ఎలా పూర్తి చేయాలని దామిని, కిరణ్ రాథోడ్.. పక్కా ప్రణాళికను కూడా వేశారు.


ప్రణాళిక ఫెయిల్..
సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడం కోసం కిచెన్‌లోకి వెళ్లిన దామిని, కిరణ్ రాథోడ్.. గుడ్లు తీసుకున్నారు. ముందుగా దామిని.. దూరంగా ఉన్న గౌతమ్ కృష్ణ దగ్గరకు వెళ్లి, తన తలపై గుడ్డు పగలగొట్టింది. అలా చేసేసరికి కంటెస్టెంట్స్ అందరికీ వెంటనే అది టాస్క్ అని అర్థమయిపోయింది. అందుకే శుభశ్రీ.. మరో గుడ్డు తీసుకొని దామిని తలపై కొట్టడానికి ప్రయత్నించింది. పగలగొట్టింది కూడా. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా దామిని చేస్తుంది టాస్క్ అని తెలిసి అలర్ట్ అయ్యారు. కొందరు అయితే బాత్‌రూమ్‌లోకి పారిపోయారు. రతిక, శివాజీ, పల్లవి ప్రశాంత్.. ముగ్గురు వేర్వేరు బాత్‌రూమ్స్‌లోకి వెళ్లిపోయి.. ఎవరు ఎంత చెప్పినా బయటికి రాలేదు.


ఓడిపోయిన దామిని..
కంటెస్టెంట్స్ అంతా అలర్ట్ అవ్వడంతో దామినికి తన టాస్క్‌ను పూర్తిచేసే అవకాశం రాలేదు. దీంతో తను టాస్క్‌లో విఫలమయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. తను టాస్క్ ఓడిపోయేలా చేసినందుకు కంటెస్టెంట్స్‌పై తనకు కోపం ఉందని దామిని ప్రకటించింది. మరోవైపు కిరణ్ రాథోడ్ మాత్రం కిచెన్‌లో తనకు దగ్గర్లో ఉన్న మనుషుల తలలపై మాత్రమే గుడ్లు కొట్టి తన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసింది. ఆమ్లెట్ వేసి బిగ్ బాస్‌కు పంపించింది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత శుభశ్రీని, పల్లవి ప్రశాంత్‌ను గార్డెన్ ఏరియాలో నిలబడమన్నాడు బిగ్ బాస్. అసలు ఎందుకు, ఏంటి అని చెప్పకుండా వారి మైక్స్‌ను తీసేయమన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వారిని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకమన్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లోకి అయిదవ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు చుక్కలు చూపించాడు.


Also Read: ప్రముఖ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ అరెస్ట్‌, కారణం ఏంటో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial