బిగ్ బాస్ సీజన్ 7లో అస్త్రాల గురించి పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారంలో పవర్ అస్త్రా కోసం పోటీ చాలా రసవత్తరంగా సాగింది. ఇక రెండో వారంలో ముందు మాయాస్త్రం, ఆ తర్వాత పవర్ అస్త్రా అంటూ కాస్త డోస్ పెంచాడు బిగ్ బాస్. ఇప్పటికే మాయాస్త్రం కోసం రెండు టీమ్స్ పోటీపడడం, అందులో నుండి ఒక టీమ్ గెలవడం కూడా అయిపోయింది. అలా గెలిచిన టీమ్ అందరికీ మాయాస్త్రాలు దక్కాయి. కానీ మాయాస్త్రాలు దక్కడం పాయింట్ కాదు.. దాని తర్వాత అందులో ఎవరు పవర్ అస్త్రాను దక్కించుకోగలరు అన్నదే పాయింట్. ఆ పవర్ అస్త్రాను దక్కించుకునే రేసులో ప్రస్తుతం ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండగా.. అనూహ్యంగా మూడో కంటెస్టెంట్ కూడా ఈ పోటీలో జాయిన్ అయ్యాడు. 


నిన్న (సెప్టెంబర్ 14న) ప్రసారం అయిన ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా.. ఈ ముగ్గురి దగ్గర మాయాస్త్రాలు ఉన్నాయి. నేటి (సెప్టెంబర్ 15న) ఎపిసోడ్ మొదలు అవ్వగానే ప్రిన్స్ యావర్ దగ్గర ఉన్న మాయాస్త్రాన్ని తీసుకొని శివాజీకి ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. దీంతో పవర్ అస్త్రా కోసం పోటీపడే కంటెస్టెంట్స్‌లో ఇద్దరే మిగిలారు. అదే శివాజీ, షకీలా. కానీ ఇంతలోనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. రెండో పవర్ అస్త్రా కోసం మరొక కంటెస్టెంట్ పోటీ పడవచ్చని, ఆ పోటీపడే కంటెస్టెంట్ ఎవరైతే బాగుంటుందో సందీప్ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ చెప్పిన విషయానికి అందరూ షాక్ అయ్యారు. ఎవరికి వారు పవర్ అస్త్రాను ఎవరికి దక్కితే బాగుంటుంది అనే విషయాన్ని సందీప్‌తో విడివిడిగా చర్చించడం మొదలుపెట్టారు.


పోటీకి సిద్ధమయిన ఆ ముగ్గురు..
రెండో పవర్ అస్త్రా కోసం పోటీపడే మూడో కంటెస్టెంట్‌గా అమర్‌దీప్‌ను సెలక్ట్ చేశాడు సందీప్. దీంతో సందీప్.. అమర్‌దీప్‌తో ఉన్న స్నేహంతోనే అలా చేశాడని హౌజ్ అంతా అనుకోవడం మొదలుపెట్టారు. శివాజీ కూడా సందీప్ నిర్ణయాన్ని, బిగ్ బాస్ ఆదేశాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. గేట్స్ తీయండి వెళ్లిపోతా అంటూ పదేపదే అన్నాడు. కానీ సందీప్ నిర్ణయం ఫైనల్‌గా నిలిచింది. రెండో పవర్ అస్త్రా కోసం షకీలా, శివాజీ, అమర్‌దీప్.. రంగంలోకి దిగారు. టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఒక చెవిని ఏర్పాటు చేశారు. ఆ చెవిలో ఎవరైతే బిగ్ బాస్ అని గట్టిగా అరుస్తారో.. వారికే పవర్ అస్త్రా దక్కుతుందని బిగ్ బాస్ వెల్లడించారు.


చెవిలో అరవండి..
శివాజీ, షకీలా, అమర్‌దీప్ విడివిడిగా వెళ్లి.. మూడుసార్లు ఆ చెవిలో బిగ్ బాస్ అని అరిచారు. ఎవరికి వారు గట్టిగానే పవర్ అస్త్రా కోసం ప్రయత్నించారు. అందరిలో షకీలా బాగా అరిచారని కంటెస్టెంట్స్ అంతా మెచ్చుకున్నారు. పైగా అలా అరవడం వల్ల షకీలా గొంతు పోయిందని, అందుకే తనకు పవర్ అస్త్రాను ఇచ్చేయమని టేస్టీ తేజ.. బిగ్ బాస్‌ను కోరాడు. టాస్క్ పూర్తయిన తర్వాత అసలు రెండో పవర్ అస్త్రా ఎవరికి దక్కింది, అసలు ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు అనే విషయాన్ని వీకెండ్‌లో నాగార్జున వచ్చినప్పుడు చెప్తారని తెలిపాడు బిగ్ బాస్. దీంతో రెండో పవర్ అస్త్రా ఎవరికి దక్కిందో తెలుసుకోవాలంటే కంటెస్టెంట్స్ వీకెండ్ వరకు ఆగాల్సిందే. పైగా ఈ రెండో పవర్ అస్త్రా సాధించేవారికి నాలుగు వారాలు ఇమ్యూనిటీతో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా దక్కనున్నాయి.


Also Read: చిరంజీవి సినిమాలో కథానాయికగా అనుష్క?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial