Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫినాలే వీక్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇక ఇది ఫినాలే వీక్ కావడంతో ఇందులో కంటెస్టెంట్స్ కష్టపడి, గొడవపడి ఆటలేవీ బిగ్ బాస్ ఇవ్వరు. ఈ వారమంతా ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న హౌజ్‌మేట్స్ జర్నీని వారికి చూపిస్తూ.. హౌజ్‌లో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఉండడమే బిగ్ బాస్ పని. అంతే కాకుండా ఈ టాస్కులు లేకుండా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కలిసుండేలా కూడా చేస్తారు బిగ్ బాస్. ఇక తాజాగా విడుదలయిన ప్రోమోలో బిగ్ బాస్.. అమర్‌దీప్‌కు తన జర్నీని చూపించి ఎమోషనల్ చేశారు. అమర్ కూడా తన జర్నీ చూసుకుంటే బిగ్ బాస్ హౌజ్‌లో తను మర్చిపోలేని విషయాలను మరోసారి గుర్తుచేసుకున్నాడు.


ఎప్పటికీ వెలిగే జ్యోతి..
ముందుగా అమర్‌దీప్ జర్నీలో గుర్తుండిపోయే కొన్ని విషయాల ఫోటోలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ‘‘మీరు పేరుకు అర్ధం - ఎప్పటికీ వెలిగే జ్యోతి. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించింది. ఎలాగైనా ప్రతీ ఆటలో గెలిచి చివరి వరకు చేరాలని మీ తపన మీ ప్రయాణాన్ని మలిచింది’’ అంటూ బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ మాట్లాడడం ప్రారంభించే కంటే ముందు తనకోసం ఏర్పాటు చేసిన వస్తువులను, ఫోటోలను తిరిగి చూశాడు అమర్‌దీప్. అక్కడ ఏర్పాటు చేసిన బ్రిక్స్ చూసి కెప్టెన్సీ టాస్క్‌ను గుర్తుచేసుకున్నాడు. అదే టాస్కులో తన కెప్టెన్సీ పోయిన తర్వాత అమర్ ఏడ్చిన ఫోటో కూడా అక్కడే ఉంది. అది చూసి ‘‘చూస్తుంటే నాకే ఎంతో బాధగా ఉంది’’ అంటూ  బిగ్ బాస్‌తో చెప్పాడు అమర్.


కవచంలాగా మారిన స్నేహితులు..
‘‘మీ చిన్నపిల్లాడి మనస్థత్వాన్ని, మీ అల్లరిని, మీ వెటకారాన్ని మీ స్నేహితులకంటే ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు. అందుకే కొన్నిసార్లు మీ కట్టలు తెంచుకున్న భావోద్వేగాలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఆపే కవచంలా మీ స్నేహితులే మారారు’’ అని అమర్‌దీప్ ఫ్రెండ్స్ అయిన ప్రియాంక, శోభాల గురించి చెప్పారు బిగ్ బాస్. ‘‘మీలో ఆవేశం ఎంత ఉందో.. వినోదం కూడా అంతే ఉంది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ‘‘పొరపాటు చేయని మనుషులు ఎవరూ లేరు. ఆ పొరపాట్లు తెలుసుకొని ముందుకు కదిలేవారిని ఎవరూ ఆపలేరు’’ అంటూ అమర్ జర్నీని బిగ్ బాస్ వివరించారు. ఇదంతా చూసి అమర్‌దీప్.. ఫుల్ ఖుషీ అయ్యాడు.



కెప్టెన్సీ కోసం తపన..
మొదటి వారాల్లో బాగా ఆడడం లేదని, ఆటల్లో తన 100 శాతం ఇవ్వడం లేదని పదేపదే అందరితో చెప్పించుకున్నాడు అమర్‌దీప్. కానీ మెల్లగా తన ఆట ఇంప్రూవ్ అయ్యింది. కానీ కోపం, ఆవేశం విషయంలో మాత్రం అమర్.. అప్పుడప్పుడు తన కంట్రోల్‌ను కోల్పోతూ ఉండేవాడని ప్రేక్షకులు సైతం భావించారు. ముఖ్యంగా ప్రియాంకతో కెప్టెన్సీ విషయంలో పోటీపడుతున్నప్పుడు తనకు కెప్టెన్సీ దక్కదు అని అర్థమయిన తర్వాత అమర్ ఏడుపు ఎన్నోరోజుల వరకు ప్రేక్షకులు మర్చిపోరేమో. ముఖ్యంగా కెప్టెన్సీ కోసం అమర్‌దీప్ ఎంతో తపనపడ్డాడు. అందరి మద్దతుతోనే కెప్టెన్ అవుతారు అన్నప్పుడు అందరినీ ఎంతో బ్రతిమిలాడుకున్నాడు. ఇక చివరిగా ఫినాలే అస్త్రా కోసం అమర్‌దీప్ ఇచ్చిన గట్టి పోటీ చూసి.. నాగార్జున తనను కెప్టెన్ చేసి తన కోరికను తీర్చారు.


Also Read: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ