ఎపిసోడ్ స్టార్ట్ కాగానే టాప్ 5 కాఫీ కోసం పడ్డ పాట్లు చూపించారు. డెమోన్ ను ఆడపిల్లలా రెడీ చేసి "మీట్ మై పెళ్ళాం పావని" అంటూ పరిచయం చేశాడు ఇమ్మాన్యుయేల్. డెమోన్ చేత కాఫీ, చికెన్ రిక్వెస్ట్ చేయించారు. 'ఫీలింగ్స్' పాటకు స్టెప్పులు కూడా వేశారు ఇమ్మూ, డెమోన్. సాయంత్రం 5 గంటలకు మటన్, కాఫీ పౌడర్ పంపారు బిగ్ బాస్.
కామనర్ గా కళ్యాణ్ ఏవీ అదుర్స్
"కళ్యాణ్ మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరోగా ముగిసి పోని కథ. కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షను దాటి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థాయిలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్ధాన్ని ఇచ్చారు. ఓనర్ గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించినా, పోను పోనూ ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేనే, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తేనే కానీ ముందుకు కదలేని పరిస్థితిలో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పు పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వాళ్ల కోసం ఎలాంటి త్యాగాలనైనా అలవోకగా చేసే బంధం ఏర్పడింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణం మిమ్మల్ని కుంగదీసింది. అయినా తేరుకున్నారు. తప్పుల్ని సరిచేసుకొని వాటిని సరైన సమయంలో మీ ఆటలో అమలు చేశారు. సరైన దిశలో నడవడమే కాకుండా విజయాన్ని అందించే మార్గాన్ని ఎంచుకున్నారు. భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె బలంతో నిబ్బరంగా నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలో ఉన్న యోధుల్ని నిద్రలేపింది. మొదటి ఫైనలిస్ట్ గా కూడా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణరావు - లక్ష్మిల కొడుకు కళ్యాణ్ రావు అనే మాట ఇప్పటివరకు... కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు. గొప్ప కలలు కనుందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్ కి దిక్సూచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణం ఇప్పుడు ఒకసారి చూద్దాం" అంటూ ఏవీని చూపించారు.
సంజనాకు సెకండ్ ఇన్నింగ్స్
"మమ్మీకి చాలా ప్రాబ్లం అయ్యింది. రెస్పెక్ట్ సంపాదించడానికి వచ్చింది. అరగంట అని చెప్పి ఇప్పటిదాకా రాలేదు సారీ" అంటూ తన కొడుకు ఫోటోని చూసి ఎమోషనల్ అయ్యింది సంజన. "నాకొక గాడ్ ఫాదర్ లేడు అని బాధ పడుతున్న టైమ్ లో మీరు నా లైఫ్ లోకి వచ్చారు. మీరే నా హీరో, సెకండ్ ఫాదర్, గాడ్ ఫాదర్ బిగ్ బాస్" అంటూ బిగ్ బాస్ ను ఆకాశానికెత్తేసింది సంజనా. "సంజనా టాప్ గేర్ లో ఆటను మొదలుపెట్టి టాప్ ఫైవ్లోకి చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దానిని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు సీజన్ 9 మొదటి కెప్టెన్ గా నిలిచి, ఆరోజు నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటివారం నుంచి 15 వారాల వరకు ఇంట్లో ఏం జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీ కోసం జరగాలి. అది మీ ఆటపై ఈ ఇంట్లోని మనుషులపై మీరు చూపిన ప్రభావం. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరలా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతిలోనే ఉందని మీరు బలంగా నమ్మారు. సంజన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో జరగబోతుంది అని క్యూరియాసిటీని ఆడియన్స్ కి కలిగించి, .సంజన సైలెన్సర్ గా, సంజు బాబాగా, మమ్మీగా, ఎవరికీ అర్థం కాని గేమర్ గా ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు. మీ ఆత్మవిశ్వాసమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఒక మాట మీద నిలబడితే ఎదురుగా ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం, మీ దూకుడు మనస్తత్వం, కత్తులు లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అలాంటప్పుడు మీ మనసుకు దగ్గరైన వారితోనే విభేదాలు వచ్చాయి. అది మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టింది. కష్టాలను ఓర్చుకొని ఇంట్లో మీరు సాధించిన ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ బాబు, మీ ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు. ఆ ప్రయాణాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం" అంటూ సంజన ఏవిని ప్లే చేశారు.