బిగ్ బాస్ 101వ రోజు రాత్రి 11 గంటలకు "తనూజా తెరమీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూతురిగా మిగిల్చాయి. గొప్ప పాత్రలో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు. మనుషుల్ని ఎలాంటి పరదాలు లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలి,చి మీరు ఎంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం... మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతీతులు కారనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారే. మీరు మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి.
చిచ్చర పిడుగు తనూజ
మీరు ఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులు... ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. మీ రీల్ రియల్ పర్సనాలిటీతో మా అందరిని ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆటలు ఆడతారని, ఎప్పుడూ అందరి మద్దతు కోసం పాకులాడుతారని చాలామంది నిందించినప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని, అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి మీ ఆటనే ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నచ్చుకునే దూది లాంటి సునితత్వం, కదనరంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి ఆట కేవలం టాస్క్ లో మాత్రమే బయటకు వస్తే, మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఇంట్లో - ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలుగా మారి, అందరి ప్రేమను పొందిన విధానమే తనూజ పుట్టస్వామిని ఇక్కడ ఈరోజు నిలబెట్టింది. ఎన్నో భావాలతో బంధాలతో నిండిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం" అంటూ తనూజా ఏవీ వేశారు. నిజమైన యోధుడు డెమోన్
తర్వాత డెమోన్ వంతు వచ్చింది. "పవన్ మీ విల్ పవర్, మీ ఫిట్నెస్, మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో... ఒక బలమైన పోరాటం చేయడానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణమే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి తత్వం. కామనర్ గా అడుగు పెట్టిన మీరు ఈ బిగ్ బాస్ పోరాటంలో కంకరింగ్ గా మారిన తీరు ఎదుటివారి వెన్నులో వణుకు పుట్టించింది. ఎందుకంటే ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డెమోన్ చేసే విధ్వంసం ఏంటో వారు దగ్గరుండి చూశారు. నామినేషన్లో మీ మీద ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిలుచున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు. పవన్ మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వారి ఆట కాకావికలం. చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశం విజయం వైపు నడవడానికి ఉపయోగించారు. సఫలమయ్యారు. మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు, ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే. మీకోసం ఎవ్వరూ నిలబడకపోయినా మీ కోసం మీరు వన్ మాన్ ఆర్మీగా నిలబడ్డారు.
హెల్దీ బాడీ, మైండ్ అని నమ్మే మీ మాట మీ మనసు మాత్రం వినలేదు. మీకోసం తపించే మరొకరి వెంట నడిచింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. టాస్క్ లలో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మళ్లీ అమాంతం మోకాళ్ళ మీదికి తీసుకొచ్చింది. ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాకు కూడా తెలుసు. కానీ తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుల్ని తట్టి లేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా ఇప్పుడు టాప్ పైలో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం" అంటూ డెమోన్ ఏవీ వేశారు. చివరగా తనూజ, డెమోన్ ఇద్దరూ బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ కు థాంక్స్ చెప్పారు.