Bigg Boss 7 Telugu: రెండు టీమ్స్‌గా విడిపోయిన తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ మధ్య వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. ఆరు వారాల నుండి బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటున్న వారంతా ఆటగాళ్లుగా, కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారితో పాటు సీక్రెట్ రూమ్ నుండి మళ్లీ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ పోటుగాళ్లుగా విడిపోయారు. అయితే ఈ ఆటగాళ్లు, పోటుగాళ్లులో ఎవరు బెస్ట్ అని నిరూపించుకోవాలని, అలా నిరూపించుకున్న టీమ్‌కే బిగ్ బాస్ హౌజ్‌పై అధికారాలు ఉంటాయని బిగ్ బాస్ ప్రకటించారు. ఇప్పటికే ఎవరు బెస్ట్ అనే ఛాలెంజ్‌లో రెండు టాస్కులు ముగిశాయి. తాజాగా మూడో టాస్క్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.


మూడో టాస్క్ మొదలు..
ఇప్పటికే ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య ఎవరు ఫిట్టెస్ట్, ఎవరు జీనియస్ అని రెండు పోటీలు జరిగాయి. అనూహ్యంగా ఈ రెండు పోటీలలో పోటుగాళ్లే గెలిచి రెండు పాయింట్స్ సంపాదించుకున్నారు. మూడో టాస్కులో అయినా ఆటగాళ్లు గెలవకపోతే.. వారికి తర్వాత గెలిచే అవకాశాలు మరింత తగ్గిపోతాయి. ఈ మూడో టాస్క్ ఏంటో తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమోలో వివరించారు. ‘‘బిగ్ బాస్ మీకు ఇస్తున్న మూడో టాస్క్ హూ ఈజ్ ది ఫాస్టెస్ట్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్‌ను కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని అడగాలి కంటెస్టెంట్స్’’ అని బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది.


అశ్వినికి బిగ్ బాస్ కౌంటర్..
బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్‌ను ఆడడానికి ఆటగాళ్ల నుండి ఒకరు, పోటుగాళ్ల నుండి ఒకరు ముందుకు రావాలి. అలా ఆటగాళ్ల నుండి అమర్‌దీప్ రాగా.. పోటుగాళ్ల నుండి అశ్విని శ్రీ బరిలోకి దిగింది. ముందుగా వీరికి గ్రీన్ కలర్ ఇచ్చారు బిగ్ బాస్. అంటూ బిగ్ బాస్ ప్రాపర్టీలలో గ్రీన్ కలర్ వస్తువు ఏదైనా కూడా తీసుకొచ్చి అక్కడ గీసి ఉన్న బాక్స్‌లో పెట్టాలి. ముందుగా వీరికి గ్రీన్ అని చెప్పగానే.. ప్లేట్ తీసుకొచ్చి పెట్టాడు అమర్‌దీప్.. కానీ అశ్విని మాత్రం చాలా తెలివిగా అక్కడే ఉన్న గడ్డిని పీకి బాక్స్‌లో వేయాలనుకుంది. ‘‘మీరు వేసినదాన్ని కాస్త చూపిస్తారా’’ అని బిగ్ బాస్ అడగగా.. అశ్విని వెతకడం మొదలుపెట్టింది. ‘‘మీరు వేసింది మీరే కనిపెట్టలేకపోతే బిగ్ బాస్‌కు ఎలా తెలుస్తుంది’’ అని కౌంటర్ ఇచ్చారు బిగ్ బాస్.


ప్రియాంకపై అరిచిన శోభా..
ఆ తర్వాత ఆడడానికి వచ్చిన సందీప్, అర్జున్‌లకు లెమన్ కలర్ చెప్పారు బిగ్ బాస్. అయితే వీరిద్దరూ వెళ్లి వేర్వేరు కలర్స్‌లో ఉన్న కుర్చీలను తీసుకొచ్చారు. ‘‘మీరిద్దరూ స్కూల్‌కు వెళ్లి కలర్స్ సరిగా నేర్చుకోలేదు అనిపిస్తోంది’’ అంటూ సందీప్, అర్జున్ చేసిన పనికి కౌంటర్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ చెప్పిన కలర్స్‌లోని వస్తువులను తీసుకురావడానికి కంటెస్టెంట్స్ అంతా పోటాపోటీగా పరిగెత్తినట్టు ఈ ప్రోమోలో చూపించారు. ప్రియాంక, నయని పావని మధ్య జరిగిన పోటీలో నయని ముందుగా వస్తువును తీసుకొచ్చి బాక్స్‌లో వేసింది. దానికి ప్రియాంకపై అరిచింది శోభా. ఆ తర్వాత అమర్‌దీప్, అశ్వినిలను పెద్ద స్పూన్ తీసుకురమ్మని చెప్పారు బిగ్ బాస్. వారు తీసుకొచ్చిన తర్వాత ‘‘ఆ రెండు స్పూన్స్‌లో ఏ స్పూన్‌తో స్విమ్మింగ్ పూల్‌ను త్వరగా ఖాళీ చేయవచ్చు’’ అని అడిగారు. అప్పుడు అమర్‌దీప్ తన చేతిలోని స్పూన్‌ను చూపించాడు. ‘‘ఒకసారి చేసి చూపిస్తారా’’ అంటూ అమర్‌దీప్‌కు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది చూసి కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు.



Also Read: రైతుబిడ్డ 'బ్యాడ్ కెప్టెన్' అన్న హౌస్​మేట్స్.. కెప్టెన్సీ రద్దు చేసిన 'బిగ్​బాస్'





Join Us on Telegram: https://t.me/abpdesamofficial