Ambati Arjun: ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయిన ఏ కంటెస్టెంట్ కూడా విన్నర్ అవ్వలేకపోయారు. కానీ ఇతరులకు గట్టి పోటీ ఇచ్చి ఆటల్లో చురుగ్గా ఉన్నవారు మాత్రం ఉన్నారు. ఇక తెలుగులో జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో గుర్తుండిపోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్ట్ తీస్తే.. అందులో అర్జున్ పేరు కచ్చితంగా ఉంటుంది. మామూలుగా బిగ్ బాస్ అనే రియాలిటీ షోలోకి ఎంటర్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరిపై ఎంతోకొంత నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఎక్కువగా నెగిటివిటీ లేని కంటెస్టెంట్ ఎవరు అంటే అర్జున్ అనే చెప్పాలి. ఒకవేళ తను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కాకపోయింటే.. ఈజీగా టైటిల్ విన్నర్ అయ్యేవాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అర్జున్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ుమరి.. అర్జున్ ఫినాలే వరకు వచ్చేందుకు కలిసి వచ్చిన అంశాలేమిటీ? అతడు ఎందుకు ట్రోఫీ వరకు వెళ్లలేకపోవడానికి కారణాలేమిటీ తదితర అంశాలపై ఓ లుక్కేయండి.
ఫ్యాన్‌బేస్ కోసం ఆశపడలేదు
బిగ్ బాస్ సీజన్ 7కు ఉల్టా పుల్టా అనే ట్యాగ్ ఇచ్చి అయిదు వారాలు పూర్తయిన తర్వాత హౌజ్‌లోకి మరో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించారు నాగార్జున. అలా వచ్చినవారిలో అర్జున్ కూడా ఒకరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని, అప్పటివరకు హౌజ్‌లో ఏం జరిగింది, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఏ కంటెస్టెంట్ గురించి ప్రేక్షకులు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుస్తుందని అందరూ అనుకుంటారు. దానివల్ల వారు ప్రత్యేకమైన స్ట్రాటజీలు కూడా సిద్ధం చేసుకొని బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు.
అయితే అర్జున్ కూడా అలాగే వచ్చాడని ప్రేక్షకులు అనుకున్నారు. అప్పటికే శివాజీ, ప్రశాంత్‌లకు బయట ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన చాలామంది ఆ బ్యాచ్‌తో తిరిగితే వారికి ప్లస్ అవుతుందని అనుకొని అలాగే చేశారు. కానీ అర్జున్ మాత్రం వ్యక్తిగతంగా ఆడి గెలవాలని టార్గెట్ పెట్టుకొని వచ్చాడు. అందుకే ఎప్పుడూ ఎవరి సాయం తీసుకోలేదు. ఏ పాయింట్ అయినా స్పష్టంగా చెప్పడం, నచ్చని విషయానికి దూరంగా ఉండడం, ఎమోషన్స్‌లో కంట్రోల్‌లో పెట్టుకోవడం.. ఇవన్నీ అర్జున్‌లో ప్లస్‌గా మారాయి. ఈ క్వాలిటీస్‌నే ప్రేక్షకులు ఇష్టపడ్డారు కూడా. ముఖ్యంగా ఫినాలే అస్త్రా టాస్క్ సమయంలో కంటెస్టెంట్స్ అందరికీ అర్జున్ ఇచ్చిన గట్టి పోటీని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. తనకు పాయింట్స్ త్యాగం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా.. అందరినీ ఓడించి ఫినాలే అస్త్రాను దక్కించుకున్నాడు. అందుకే అర్జున్ గెలిస్తే బాగుంటుంది అనుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.
బలగం లేకపోవడమే మైనస్
బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే బలం మాత్రమే కాదు.. బలగం కూడా ఉండాలని అర్జున్ తెలుసుకున్నాడు. తను ఫినాలే అస్త్రాను దక్కించుకోకపోయింటే.. ఆ వారంలోనే ఎలిమినేట్ అయిపోయేవాడని నాగార్జున చెప్పిన మాటలు.. అర్జున్‌పై చాలా ప్రభావం చూపించాయి. తను ఎంత కష్టపడి ఆడినా.. ఓట్ల విషయంలో చివరి స్థానంలో ఉన్నానని తనకు అర్థమయ్యింది. వ్యక్తిగతంగా, ఆటపరంగా.. అర్జున్‌లో మైనస్‌లు పెద్దగా లేకపోయినా.. బయట సపోర్ట్ ఎక్కువగా లేకపోవడం తనకు పెద్ద మైనస్‌గా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నుంచే కంటెస్టెంట్‌గా ఉండి, ఇదే ఆట కనబరిచి ఉంటే.. అర్జున్ కచ్చితంగా విన్నర్ అయ్యేవాడని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తను హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆడిన చాలావరకు టాస్కుల్లో అర్జున్ విన్నర్‌గా నిలిచాడు.. అది కూడా ఏ ఫౌల్ గేమ్ లేకుండా. అయినా కూడా తను విన్నర్ కాడేమో అన్న ఆలోచన.. తనకు ఓట్లు వేసేవారిని బాధిస్తుంది. మరి, అర్జున్ ఇప్పటికే ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి, అందులో నిజమెంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.