బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో నాగార్జున మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యత తీసుకున్నారు. విదేశాల్లో ఈ షో బాగా క్లిక్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ప్రేక్షకులు ఆదరిస్తారా..? లేదా అనే సందేహాలుకలిగాయి . కానీ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపి మొదటి సీజన్ ను విజయవంతంగా నడిపించారు. అప్పట్లో లాంచింగ్ ఎపిసోడ్ కి 16.18 టీఆర్ఫీ వచ్చింది.
ఆ తరువాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించినప్పుడు లాంచ్ ఎపిసోడ్ కి 15.05 టీఆర్ఫీ వచ్చింది. అయితే మూడో సీజన్ కు తాను హోస్ట్ గా వ్యవహరించలేనని నాని తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునను తీసుకొచ్చారు. నాగ్ కూడా ఎంతో గ్రాండ్ గా షోను మొదలుపెట్టారు. అప్పట్లో నాగ్ హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ కి ఊహించని విధంగా 17.92 రేటింగ్ టీఆర్ఫీ వచ్చింది. తరువాత నాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది.
దీంతో తన రికార్డ్ ను తనే బ్రేక్ చేసుకున్నట్లైంది. ఐదో సీజన్ తో ఆ రేటింగ్ తిరగరాస్తాడని అందరూ అనుకున్నారు. కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి లాంచ్ ఎపిసోడ్ కి కాస్త తక్కువ రేటింగ్ వచ్చింది. 18 టీఆర్ఫీ వచ్చింది. ఈ విషయాన్ని నాగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.