బిగ్‌బాస్‌ రియాల్టీ షో మరోసారి వివాదాల్లో చికుక్కుంది. ఇన్నాళ్లు నాయకులు, సామాన్యులు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్స్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. 


యువతను పక్కదారి పట్టించేలా బిగ్‌బాస్‌ కంటెంట్‌ ఉందని.. వల్గారిటీ ప్రోత్సహించేదిగా ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో ఓ పిల్ వేశారు. ఇన్నాళ్లకు ఇది హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. దీన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు రిక్వస్ట్ చేశారు. 


దీన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్ టి. రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. సోమవారం విచారిస్తామని తెలిపింది ధర్మాసనం. 


ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షోపై కొన్ని కీలక కామెంట్స్ చేసింది హైకోర్టు ధర్మాసనం. మంచి వ్యాజ్యం వేశారని పిటిషనర్‌కు కితాబిచ్చింది న్యాయస్థానం. ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యత పెంచుతున్నాయని... తమ పిల్లలు బాగున్నారు కదా ఇలాంటి కార్యక్రమాలతో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇలా ఇతరుల సమస్యలు గురించి పట్టించుకోకుంటే... మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోరని అభిప్రాయపడింది కోర్టు. 2019లో పిల్ వేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్ జరగలేదా అని న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. లేదని న్యాయవాది సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై సోమవారం విచారిస్తామంది. 


ఎప్పటికప్పుడు బిగ్‌బాస్‌ వివాదల సుడిలో చిక్కుకుంటూనే ఉంది. నాయకులు, సామాజిక సంస్థలు ఈ ప్రోగ్రామ్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత పెడదారి పట్టి లివింగ్ టుగెదర్ లాంటి సంస్కృతికి అలవాటు పడిపోతారని అభిప్రాయపడుతుంది. అయితే ఇదంతా షో ముగిసేంత వరకే ఉంటుంది. తర్వాత పట్టించుకునే వాళ్లే ఉండరు. ఇప్పుడు ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కడంతో ఎంత సీరియస్ అవుతుందో అన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది. 


సీపీఐ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ ఈ బిగ్‌బాస్‌పై గతంలో చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలని నిర్వాహకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్‌ అప్పట్లో పెను దుమారం రేపాయి. బిగ్‌బాస్‌ కంటెంట్‌ కంటే ఆయన చేసిన కామెంట్స్‌ పై మహిళాసంఘాలు, కొందరు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నడుస్తున్న బిగ్‌బాస్‌ ఓటీటీ సిరీస్‌పై కూడా ఆయన కామెంట్స్ చేశారు. టీవీలో వచ్చిన కంటెంట్‌కు ముందురోజే షూట్ చేసి టెలీకాస్ట్ చేసే వాళ్లు ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ అలా కాదు. ఎప్పటికప్పుడు టెలీకాస్ట్ చేస్తున్నారు. దీనిపై కూడా కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి.