అరుణ్ రెడ్డి పేరు చెబితే 'ఎవరు? అని తెలుగు ప్రేక్షకులు అడగొచ్చు. గుర్తు పట్టడం కూడా కష్టం కావచ్చు. కానీ, వీజే సన్నీ అంటే సులభంగా గుర్తు పడతారు. 'బిగ్ బాస్' విజేత సన్నీ (Bigg Boss Sunny) అంటే ఇక చెప్పనవసరం లేదు. త్వరలో 'బిగ్ బాస్ 6' (Bigg Boss 6 Telugu) రాబోతోంది. దీని కంటే ముందు సీజన్‌లో సన్నీ విన్నర్. ఆయన జీవితంలో అరుదైన సంగతులు...
ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు...
సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి (VJ Sunny Real Name). జన్మించింది ఖమ్మంలో... ఆగస్టు 17, 1989లో (VJ Sunny Birthday)! ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఖమ్మంలో పెరిగారు, అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ప్రగతి కాలేజీలో సెకండ్ ఇయర్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని 'వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్'లో డిగ్రీ చేశారు (ఇంటర్‌నెట్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో చేసినట్లు కొందరు తప్పుగా రాస్తున్నారు).
వాళ్ళతో స్నేహం... హిందీ పాఠం!
డిగ్రీ కాలేజీలో సన్నీ క్లాస్‌మేట్స్ అందరూ నార్త్ ఇండియన్స్. అందరూ ముంబై, వెస్ట్ బెంగాల్, బీహార్ నుంచి వచ్చేవారే. తెలుగు అబ్బాయి సన్నీ ఒక్కడే. నార్త్ ఇండియన్స్‌తో ఫ్రెండ్షిప్ చేయడంతో తనకు హిందీ బాగా వచ్చిందని సన్నీ చెబుతుంటారు.
బైక్ రైడర్ అయినప్పటికీ...
ఇప్పుడు నో బైక్స్, నో రైడింగ్!
మీకో విషయం తెలుసా? సన్నీ బైక్ రైడర్ కూడా! స్టంట్స్ కూడా చేసేవాడు. రెండు సార్లు హైదరాబాద్ తరఫున రేసింగ్‌కు వెళ్ళాడు. చెన్నైలోని హోండా పోటీల్లో పాల్గొన్నారు. అయితే... ఇప్పుడు రైడింగ్ చేయడం లేదు. ఎందుకంటే? 'స్పీడ్ థ్రిల్స్. బట్, కిల్స్' అంటారు సన్నీ! తనకు ఏమీ కానప్పటికీ... రేసింగ్ వల్ల యమధర్మరాజుకు హాయ్ చెప్పి వచ్చానని, అందుకని ఇప్పుడు కార్లలో మాత్రమే తిరుగుతున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు.
సింగిల్ పేరెంట్ కిడ్!
సన్నీ సింగిల్ పేరెంట్ కిడ్. ఉజ్వల్, స్పందన... ఆయనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. కారణాలు తెలియదు గానీ... చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తల్లి దగ్గర పెరిగారు. సన్నీ తల్లి పేరు కళావతి. ఆమె స్టాఫ్ నర్సుగా పని చేశారు. కళావతి తన స్నేహితురాలు అని సన్నీ చెబుతుంటారు. తల్లి దగ్గర పెరిగినా... తండ్రితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ నాన్నతో మాట్లాడుతున్నారు.
బుల్లితెర నుంచి వెండితెరకు!
చిన్నతనం నుంచి సన్నీకి నటన అంటే ఆసక్తి. బాల్యంలో 'అల్లాద్దీన్' నాటకం వేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలుత యాంకర్‌గా, ఆ తర్వాత రిపోర్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. 'కళ్యాణ వైభోగం' సీరియల్‌లో హీరోగా బుల్లితెరపై అడుగుపెట్టారు. కొన్ని రోజులకు ఆ సీరియల్ నుంచి వైదొలిగినా... ఆ తర్వాత 'బిగ్ బాస్' షోలో అడుగుపెట్టి తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.
Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!
'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళక ముందు 'సకల గుణాభి రామ' అనే సినిమాలో సన్నీ కథానాయకుడిగా నటించారు. ఆయన విజేతగా హౌస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ సినిమా విడుదలైంది. ఇప్పుడు 'డైమండ్' రత్నబాబు దర్శకత్వంలో హీరోగా 'అన్‌స్టాపబుల్' సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, శిరీష్ సమర్పణలో 'దిల్' రాజు ప్రొడక్షన్స్ పతాకంపై 'జీ 5' ఓటీటీ కోసం రూపొందుతున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఏటీఎం' (ATM Telugu Web Series)లో నటిస్తున్నారు. అందులో జగన్ పాత్ర పోషిస్తున్నారు. కొన్ని సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Satya Pulagam
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ