'బిగ్ బాస్' కౌశల్ ప్రధాన పాత్రలో 'అతడు - ఆమె - ప్రియుడు' సినిమా రూపొందింది. ఇందులో స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్, నటుడు బెనర్జీ మరో రెండు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో రెండు పేజీల డైలాగ్‌ను 'బిగ్ బాస్' కౌశల్ సింగిల్ టేక్‌లో చెప్పిన వీడియో విడుదల చేశారు.
"స్త్రీ మీద మంచి అభిప్రాయం మాత్రమే కాదు... ప్రేమ, భక్తి, గౌరవం - అన్నీ ఉన్నాయి. స్త్రీ అంటే కేవలం కార్యేషు దాసి భోజేషు మాత క్షమయా ధరిత్రి మాత్రమే కాదు... మగాడి ప్రతి అవసరంలోనూ స్త్రీ ఉంటుంది. అందుకే, స్త్రీకి అన్ని పేర్లు ఉన్నాయి. పుట్టుకతో జనని, చదువుకు సరస్వతి, పలుకలకు వాణి, నడవడానికి ధాత్రి, ధనానికి లక్ష్మి, తిండికి అన్నపూర్ణ, జ్ఞానానికి శారద, రాత్రి వెన్నెల, తెల్లవారితే ప్రత్యూష, మధ్యాహ్నం అపర్ణ, సాయంత్రం సమీరా, ఆపై సంధ్య... వేసవికాలం వసంత, వర్షాకాలం మేఘన, శీతాకాలం హేమంత, నిద్రపోతే స్వప్న, మెలకువ వస్తే స్పందన, పూజిస్తే వందన, ప్రేమిస్తే మోహన, పెళ్లైతే అరుంధతి, ప్రార్ధిస్తే గౌరీ, ధ్యానిస్తే ప్రార్ధన, వెలిగిస్తే హారతి, ప్రజ్వలిస్తే దీప ఆలపిస్తే కీర్తన, మీటితే వీణ, చదివితే రచన, చెక్కితే శిల్ప, చేస్తే శృతి, వింటే సంగీత, బాల్యం నమ్రత, యవ్వనం ప్రేమ, వృద్ధాప్యం కరుణ, గెలిస్తే కేతన, ఓడితే స్వాంతన, జీవితమంతా మమత, ఊపిరి ఆగాక శాంతి" అనే డైలాగ్‌ను 'బిగ్ బాస్' కౌశల్ చెప్పారు. ఆ సన్నివేశంలో నటుడు సునీల్, బెనర్జీ కూడా ఉన్నారు. కౌశల్ డైలాగ్ చెప్పడానికి ముందు సునీల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.
సంధ్య మోషన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి (తుమ్మలపల్లి రామసత్యనారాయణ) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. "స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను 'బిగ్ బాస్' ఫేమ్ కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఈ రోజు విడుదల చేసిన ఆ డైలాగ్‌కు మంచి స్పందన లభిస్తోంది" అని నిర్మాతలు చెప్పారు. "నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది" అని యండమూరి పేర్కొన్నారు. సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూస్తారని చిత్రబృందం ఆకాంక్షించింది.